అత్యాచారం చేశారని ఫిర్యాదు కోసం వస్తే.. స్టేషన్‌లో పోలీసులు..

5 May, 2022 07:31 IST|Sakshi

లలిత్‌పూర్‌: మూడు రోజులుగా నలుగురు తనపై అత్యాచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన 13ఏళ్ల బాలికపై సదరు స్టేషన్‌ అధికారి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. బాధితురాలిని నలుగురు వ్యక్తులు ఏప్రిల్‌ 22న భోపాల్‌ తీసుకువెళ్లారని, మూడు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తల్లి తెలిపింది. నిందితుల్లో ఒకరు బాలికను పాలి పోలీస్‌ స్టేషన్‌ దగ్గర విడిచి వెళ్లగా స్టేషన్‌ అధికారి  కూడా ఆమెపై అఘాయిత్యం చేశాడని వాపోయింది. వివరాలను బాలిక ఓ స్వచ్ఛంద సంస్థకు వెల్లడించడంతో ఆమెను జిల్లా ఎస్పీ దగ్గరికి తీసుకెళ్లింది. ఎస్పీ ఆదేశాలతో ఎస్‌హెచ్‌ఓతో పాటు బాలిక అత్త తదితరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

స్టేషన్‌లో డ్యూటీ చేస్తున్నవారందరినీ ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. డీఐజీ ఆధ్వర్యంలో 24 గంటల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు పెట్టి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారిస్తామని ఉప ముఖ్యమంత్రి బ్రజేశ్‌ పాఠక్‌ చెప్పారు. యూపీలో మహిళలకు పోలీసుల నుంచే రక్షణ లేదని విపక్షాలు దుయ్యబట్టాయి.

ఎస్‌హెచ్‌ఓ అరెస్టు
పరారీలో ఉన్న ఎస్‌హెచ్‌ఓ తిలక్‌ధర్‌ సరోజ్‌ను అరెస్టు చేసినట్టు ఏడీజీ భాను భాస్కర్‌ చెప్పారు. అతన్ని సస్పెండ్‌ చేశామన్నారు. బాలికను తిలక్‌ధర్‌ తొలుత ఆమె అత్తకు అప్పగించాడని, తర్వాత స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలంటూ పిలిచి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. అత్తను కూడా అరెస్టు చేశామన్నారు. సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. యోగి ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ఇది సిగ్గుచేటని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ చీఫ్‌ మాయావతి అన్నారు. దీన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. 

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా..

మరిన్ని వార్తలు