విద్యార్థినితో మాట్లాడాలని గదిలోకి పిలిపించుకుని..

30 Apr, 2022 16:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కెలమంగలం(బెంగళూరు): ఏడో తరగతి విద్యార్థినిపై పాఠశాల హెచ్‌ఎం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు హెచ్‌ఎంకు దేహశుద్ధి చేశారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు..  అంచెట్టి సమీపంలోని కొప్పగరై ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో డెంకణీకోటకు చెందిన లారెన్స్‌ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 7వ తరగతి విద్యార్థినిని గురువారం మాట్లాడాలని ఒక గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు.

బాలిక తప్పించుకొని ఇంటికి వెళ్లి ఇకపై పాఠశాలకు వెళ్లనని తల్లిదండ్రులతో మొరపెట్టుకొంది. బాలిక బంధువులు పాఠశాల వద్దకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేశారు.  బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు డెంకణీకోట మహిళా పోలీసులు లారెన్స్‌ను అరెస్ట్‌ చేసి  హోసూరు జైలుకు తరలించారు. సదరు హెచ్‌ఎంను సస్పెండ్‌ చేస్తూ డెంకణీకోట విద్యా జిల్లా అధికారి అన్బళగన్‌ ఆదేశాలు జారీ చేశారు. 

మరో ఘటనలో..
డాప్‌ పేరుతో దోపిడీ

యశవంతపుర: కోరమంగలలో ఒక సంస్థలో కారు డ్రైవర్‌గా పని చేస్తున్న దినేశ్‌ గురువారం రాత్రి 12 గంటల సమయంలో విధులు ముగించుకొని వీరభద్రేశ్వరనగరకు వెళ్లడానికి నాయండహళ్లి సర్కిల్‌లో వేచి ఉన్నాడు. డ్రాప్‌ చేస్తామని కొందరు వ్యక్తులు అతన్ని కారులో ఎక్కించుకొని కత్తి చూపించి రూ.3వేల  నగదు లాక్కొని అతన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక కారు డివైడర్‌ను ఢీకొంది.  దీంతో వాహనాన్ని వదలి ఉడాయించారు. గిరి నగర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు