Hyderabad: మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి.. అతి కిరాతకంగా..

30 Apr, 2022 16:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌(జీడిమెట్ల): అనుమానమే పెనుభూతమైంది.. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. తన ముగ్గురు పిల్లల సాక్షిగా భర్త భార్యను అతికిరాతకంగా కొన్ని గంటల పాటు హింసించి కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌ బతుకమ్మబండలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. బతుకమ్మబండలో నివాసముండే కర్ణి మమత(38), బాలకృష్ణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.

కాగా బాలకృష్ణ ఇద్దరు కుమారులతో కలిసి ఏసీ సర్వీసింగ్‌ పనులు చేస్తుండగా మమత ఇంట్లోనే ఉంటుంది. గతేడాది కాలంగా భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతపై అనుమానంతో ఉన్న బాలకృష్ణ గురువారం ఉదయం నుంచే ఆమెను ఇంట్లో బంధించి మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి కొట్టడం మొదలుపెట్టాడు. ఆమెను కొన్ని గంటల పాటు విపరీతంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక మమత శుక్రవారం ఉదయం మృతిచెందింది. 

స్థానికుల జోక్యంతో భర్త కట్టుకథ అట్టర్‌ ఫ్లాప్‌.. 
మమత మృతిచెందిన విషయం ఆమె ఇద్దరు కుమారులతో పాటు కుమార్తెకు సైతం తెలుసు. కాగా వారు ఇంటి తలుపులు గేట్లు మూసుకుని మృతదేహంతో ఇంట్లోనే ఉన్నారు. అనంతరం అందరూ కలిసి శుక్రవారం ఉదయం ఇంటి మొత్తాన్ని కడిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని తరలించేందుకు ప్లాన్‌ వేసుకుని ఇంటి వద్దకు అంబులెన్స్‌ను పిలిపించారు. మమత మృతదేహాన్ని అంబులెన్స్‌లోకి మారుస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు మమతకు ఏమైంది? ఒంటిపై దెబ్బలు ఏంటి అని ఆమె భర్త బాలకృష్ణను నిలదీశారు. మమత నిన్నటి నుంచి కనిపించలేదని, ఆమె అపస్మారక స్థితిలో బయట దొరికితే తీసుకువచ్చానని బాలకృష్ణ కట్టుకథ అల్లబోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బాలకృష్ణను నిలవరించి పోలీసులకు సమాచారం అందించారు.

చదవండి👉🏼 (మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం)
 
రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పోలీసులు.. 
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, సతీష్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి మమత ఒంటిపై తీవ్రమైన దెబ్బలను గుర్తించారు. ఆమె భర్తే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు బాలకృష్ణతో పాటు కుమారులు లక్ష్మణ్, శంకర్‌లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మేమే శిక్షిస్తామంటూ పోలీసులతో స్థానికుల వాగ్వాదం.. 
ఇళ్ల మధ్యే ఉన్న నరరూప రాక్షసుడిని తామే శిక్షిస్తామని స్థానికులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కలుగచేసుకున్న ఎస్సై సతీష్‌రెడ్డి స్థానికులను సముదాయించి శిక్షపడేలా మేము చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు బాలకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు