గచ్చి బౌలి దొంగతనం కేసును చేధించిన పోలీసులు

25 Sep, 2021 20:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల గచ్చి బౌలి టెలికాం నగర్‌లో నివాసం ఉంటున్న గోవిందరావ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. నిందితులు నేపాల్‌కు చెందిన లంక బహదూర్ సాహి అతని భార్య పవిత్రగా గుర్తించారు. వీరిని సోలాపూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల వద్ద నుంచి ఏడు లక్షల ఇరవై మూడు వేల రూపాయల నగదుతో పాటు 61 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. నిందితులు గత ఐదు నెలల క్రితం గోవింద రావ్ అనే వ్యక్తి ఇంట్లో పని మనుషులుగా చేరారు. ఆపై ఇద్దరు చాలా నమ్మకంగా యజమానితో వ్యవహరించారు. ఈ నెల 18న గోవింద రావు అతని ఫ్రెండ్‌తో కలిసి శ్రీశైలంకు వెళ్లగా ఆ సమయంలో అతని ఇంట్లో దొంగతనం జరిగింది. గోవింద్ రావ్ ఈ నెల 19న శ్రీశైలం నుంచి తిరిగి వచ్చే సరికి అక్కడ దొంగతనం జరగడం వీటితో పాటు పని వాళ్లు కనపడకపోవడంతో అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

దీంతో నిందితులను పట్టుకోవడం కోసం పోలీసులు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా ఎట్టకేలకు ఇద్దరిని పక్కా సమాచారం ప్రకారం సోలాపూర్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నేరుగా నేపాల్‌కు వెళ్లకుండా సోలాపూర్ లో కొంతకాలం ఉండి ఆపై నేపాల్ వెళ్లాలని వారు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. యమ్లాల్ అనే వ్యక్తి ఈ నిందితులిద్దరిని గోవింద్ దగ్గర పనికి కుదిర్చినట్టు తెలిపారు. యమ్లాల్ అనే వ్యక్తి పాత్రపై కూడా విచారణ చేస్తున్నట్లు, అతను నేపాల్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

చదవండి: అంత్యక్రియలకు డబ్బుల్లేక దుప్పట్లో భార్య మృతదేహాన్ని..

మరిన్ని వార్తలు