డీజీపీనీ వదలని సైబర్‌ నేరగాళ్లు

28 Jun, 2022 03:38 IST|Sakshi

వాట్సాప్‌ డీపీతో మోసం చేసేందుకు విఫలయత్నం

కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖుల ఫొటోలను వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని మోసాలకు పాల్ప డుతున్న సైబర్‌ నేరగాళ్లు ఈ సారి ఏకంగా రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఫొటోను డీపీగా పెట్టుకొని అధికారులు, ప్రజలకు టోకరా వేసే ప్రయత్నం చేశారు. ఓ నంబర్‌కు మహేందర్‌రెడ్డి ఫొటో పెట్టి ఒక అధికారికి మెసేజ్‌ పెట్టారు. వెంటనే ఆ అధికారి అప్రమత్తమై మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నైజీరియా నుంచి సైబర్‌ మోస గాళ్లు ఈ పని చేసినట్లు గుర్తించారు. సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్‌ కంపెనీకి ఫిర్యాదు చేసి ఆ సెల్‌ నంబర్‌ను బ్లాక్‌ చేయించినట్టు అధికారులు వెల్ల డించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని, డీపీల ద్వారా సైబర్‌ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారని, అలాంటి నంబర్లపై నిఘా పెట్టాలని సూచించారు.   

మరిన్ని వార్తలు