ఆ ఎస్‌ఐ మొదటి పెళ్లిని దాచి నన్ను మోసం చేశాడు

22 Jul, 2021 07:42 IST|Sakshi

సాక్షి, సనత్‌నగర్‌( హైదరాబాద్‌): టప్పాచబుత్రా ఎస్‌ఐ మధును నగర పోలీసు కమిషనర్‌ సస్పెండ్‌ చేశారు. ఆయనకు ఇంతకుముందే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టి.. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మధుపై ఆయన వేటు వేశారు. బాధితురాలు కథనం ప్రకారం వివరాలు.. గతంలో బేగంపేట, చిలకలగూడ పోలీస్‌స్టేషన్లలో ఎస్‌ఐగా పనిచేసిన మధు కొన్ని నెలల క్రితం టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

నమ్మించి మోసం చేశాడు
మధు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, మొదటి పెళ్లిని దాచిపెట్టి తనతో వివాహేతర సంబంధం కొనసాగించాడంటూ ఓ యువతి బేగంపేట, టప్పాచబుత్రా పోలీసులకు, వెస్ట్‌జోన్‌ డీసీపీకి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు పోలీసులు స్పందించడం లేదని బాధితురాలు ఈ నెల 19న సికింద్రాబాద్‌ సమీపంలోని పరేడ్‌గ్రౌండ్‌ వద్ద చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో బేగంపేట పోలీసులు మధుపై కేసు నమోదు చేశారు. గతంలో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసే సమయంలోనూ మధు ఒకసారి సస్పెన్షన్‌ కావడం గమనార్హం. కాగా.. సదరు యువతితో మధుకు ఇప్పటికే వివాహం జరిగిందని, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు