ఐఎఫ్‌ఎస్‌ భర్తపై ఐపీఎస్‌ భార్య ఫిర్యాదు

7 Feb, 2021 05:13 IST|Sakshi

వరకట్న వేధింపుల వ్యవహారం

బనశంకరి: భర్త కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే ఆమె సాదాసీదా మహిళ కాదు, ఓ ఐపీఎస్‌ అధికారిణి కావడం గమనార్హం. బాధితురాలు బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన 2009 బ్యాచ్‌కు ఐపీఎస్‌ అధికారిణి వర్తికా కటియార్‌ బెంగళూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 2011లో ఆమెకు భారతీయ విదేశాంగ సర్వీసు (ఐఎఫ్‌ఎస్‌) అధికారి నితిన్‌ సుభాష్‌తో వివాహమైంది. భర్త ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసేవారు.

భర్త మద్యపానం, ధూమపానం తదితర దురలవాట్లకు లోనయ్యారని, వీటిని వదలిపెట్టాలని అనేకసార్లు మొరపెట్టుకోగా కోపంతో దాడి చేశాడని వర్తికా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2016లో ఇదే విషయమై దౌర్జన్యం చేసి తన చేయి విరిచాడని తెలిపారు. దీపావళికి కానుక ఇవ్వలేదంటూ విడాకులు కావాలని బెదిరించాడని వర్తికా పేర్కొన్నారు. తన అమ్మమ్మ వద్ద రూ.5 లక్షలు, ఇంటి కొనుగోలుకని రూ. 35 లక్షల నగదు తీసుకున్నాడని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు నితిన్‌ సుభాష్, అతని కుటుంబసభ్యులు మొత్తం 7 మందిపై వరకట్న వేధింపులు, దాడులు, ప్రాణ బెదిరింపులు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు