నిత్యం మద్యం తాగి వేధింపులు.. అత్తకు వివాహేతర సంబంధంపై రచ్చ.. పక్కా ప్లాన్‌తో!

10 Oct, 2022 18:56 IST|Sakshi

ఖమ్మంఅర్బన్‌: మద్యం సేవించి నిత్యం వేధిస్తున్నాడని భావించి.. తన భర్త కాళ్లు, చేతులను కట్టి సాగర్‌ కాల్వలో పడేసిన భార్య ఉదంతమిది. శనివారం భార్య ఖమ్మంఅర్బన్‌ పోలీసుల వద్ద లొంగిపోగా మరికొందరిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన వివరాలను ఆదివారం ఖమ్మం నగర ఏసీపీ ఆంజనేయులు, ఖమ్మం అర్బన్‌ సీఐ రామకృష్ణ వెల్లడించారు. ఖమ్మం నగరం యూపీహెచ్‌ కాలనీలో నివాసముంటున్న ఎస్‌కే అన్వర్‌ (33) కొంతకాలంగా కనిపించడం లేదని అతడి తల్లి ఎస్‌కే రహమత్‌ ఈ ఏడాది జూలైలో ఖమ్మం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

సీఐ రామకృష్ణ నేతృత్వంలో అన్వర్‌ ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా అనుమానితులైన భార్య సల్మా, అత్త సాధుఖాన్, బాలాజీపై నిఘా పెట్టి వారి కదలికలను గమనిస్తున్నారు. భార్య సల్మా సొంతగ్రామమైన మహబూబాబాద్‌లో ఉంటోందని తెలిసి అక్కడి పోలీసుల సాయంతో పట్టుకోవడం కోసం తిరిగినా ఫలితం లభించలేదు. తర్వాత ఐడీ పార్టీ పోలీసుల ద్వారా  నిఘా పెంచారు. ఈ క్రమంలో పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారని భయపడి, తప్పించుకునే పరిస్థితి లేదని గ్రహించి ఖమ్మం నగరంలో వారికి తెలిసిన పెద్దమనుషుల సహకారంతో శనివారం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నిందితులు అన్వర్‌ భార్య సల్మా, అత్త సాదుఖాన్, బావమరిది యాకూబ్, బాలాజీ, వెంకన్న లొంగిపోయారు. వారిని విచారించగా అన్వర్‌ను తామే హత్య చేశామని అంగీకరించారని ఏసీపీ వెల్లడించారు. 

ఇదీ హత్యోదంతం..
అన్వర్‌ వివాహం అయిన నాటి నుంచి చికెన్‌ దుకాణంలో పనిచేస్తుండేవాడు. మద్యానికి బానిస కావడంతో పాటు గంజాయికి అలవాటు పడి భార్యను అనుమానిస్తున్నాడు. భార్య, ఇద్దరు ఆడపిల్లలను పట్టించుకోకుండా అప్పుడప్పుడూ ఇంట్లో నుంచి వెళ్లి రెండు, మూడు నెలల తర్వాత తనంతట తానుగా ఇంటికి వచ్చేవాడు. భార్యను చిత్రహింసలకు గురి చేసి కొట్టేవాడు. ఇదిలా ఉండగా అన్వర్‌ అత్త సాదుఖాన్‌ కూడా వీరి వద్దనే ఉంటూ సుతారి పనులకు వెళ్తోంది. ఆమెకు కొంతకాలంగా చింతకాని మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన బాలాజీతో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇది నచ్చని అన్వర్‌ గతేడాది యూపీహెచ్‌కాలనీలో బాలాజీ బైక్‌ను తగలబెట్టడంతోపాటు బాలాజీని కత్తితో బెదిరించాడు. దీనిపై ఖమ్మం టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. దీంతో అన్వర్‌ను చంపాలని భార్య సల్మా, అత్త కలిసి నిర్ణయించారు. గతేడాది సెప్టెంబర్‌ 30వ తేదీన రాత్రి అన్వర్‌ చేతులు, కాళ్లు కట్టి అన్వర్‌ బావమరిది యాకూబ్‌ ఆటోలో బాలాజీ, చిర్రా వెంకన్న కలిసి తీసుకెళ్లి గోపాలపురం సమీపంలోని సాగర్‌ కాల్వలో పడేశారు.

అప్పటి నుంచి వారంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయడంతో వారంతా భయపడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అన్వర్‌ భార్య సల్మా, అత్త సాదుఖాన్, యాకూబ్, బాలాజీ, చిర్రా వెంకన్నను రిమాండ్‌కు తరలించామని ఏసీపీ వివరించారు. అన్వర్‌ మృతదేహం ఆచూకీ కనుగొంటామని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు