చరిత్ర సృష్టించిన రొనాల్డో.. కోహ్లి శుభాకాంక్షలు, యువీని ఉతికి ఆరేసిన నెటిజన్లు

10 Oct, 2022 18:51 IST|Sakshi

Cristiano Ronaldo 700th Goal: పోర్చుగల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ (GOAT) క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా నిన్న (అక్టోబర్‌ 9) ఎవర్టన్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్‌ కొట్టడం ద్వారా.. ఫుట్‌బాల్‌ చరిత్రలో 700 గోల్స్‌ (క్లబ్‌ గేమ్స్‌లో) సాధించిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ అత్యధిక గోల్స్‌ (117) సాధించిన ఫుట్‌బాలర్‌గా కొనసాగుతున్న రొనాల్డో.. ఫుట్‌బాల్‌ సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. 

ఇప్పటివరకు ఓవరాల్‌గా (క్లబ్‌ గోల్స్‌+అంతర్జాతీయ గోల్స్‌) 817 గోల్స్‌ సాధించిన రొనాల్డో.. భవిష్యత్తు తరాల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఓవరాల్‌గా అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రొనాల్డో తర్వాతి స్థానంలో అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు లియోనల్‌ మెస్సీ ఉన్నాడు. మెస్సీ ఇప్పటివరకు క్లబ్స్ స్థాయిలో 691 గోల్స్, 90 అంతర్జాతీయ గోల్స్ కొట్టాడు. ఓవరాల్‌గా చూస్తే.. మెస్సీ రొనాల్డో కంటే 36 గోల్స్‌ వెనుకబడి ఉన్నాడు. 

రొనాల్డో సాధించిన ఘనతకు యావత్‌ క్రీడా ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతుండగా.. భారత స్టార్ క్రికెటర్లు కూడా మేము సైతం అంటూ సోషల్‌మీడియా వేదికగా GOATకు విషెస్‌ తెలుపుతున్నారు. రొనాల్డోకు వీరాభిమాని అయిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఇన్‌స్టా వేదికగా "THE GOAT. #700" అని విష్‌ చేయగా.. భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ట్విటర్‌లో రొనాల్డోకు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే, యువీ తాను చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల నెట్టింట దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు.  

ఎందుకంటే.. క్లబ్‌ స్థాయి ఫుట్‌బాల్‌లో రొనాల్డో 700 గోల్స్‌ చేసిన తొలి ఆటగాడు అయితే.. యువీ 700 గోల్స్‌ క్లబ్‌లోకి స్వాగతం అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇలా ట్వీట్‌ చేయడంలో యువీ ఉద్దేశం ఏదైనా.. మిస్టేక్‌ స్పష్టంగా కనిపిస్తుండటంతో ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు