అక్రమ వ్యాపారాలకు కేరాఫ్‌ అచ్చెన్న అనుచరుడు!

8 Oct, 2022 10:17 IST|Sakshi
టీడీపీ నేత అచ్చెన్నాయుడుతో నిందితుడు కోరాడ సుబ్రహ్మణ్యం (ఫైల్‌ఫొటో)  

తాజాగా నకిలీ పోలీసు నేమ్‌ బోర్డుతో ఒడిశాలో ప్రయాణం 

బరంపురంలో పట్టుబడ్డ వైనం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ అధికారంలో ఉండగా యథేచ్ఛగా పలు అక్రమ వ్యాపారాలను నిర్వహిస్తూ పబ్బం గడుపుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అనుచరుడు కోరాడ సుబ్రహ్మణ్యం తాజాగా తన కారుకు నకిలీ పోలీసు నేమ్‌ బోర్డు పెట్టుకుని తిరుగుతూ ఒడిశా పోలీసులకు దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..  కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కోరాడ సుబ్రహ్మణ్యం  కింజరాపు అచ్చెన్నాయుడికి ప్రధాన అనుచరుడు. ఈయన కొత్తపల్లిలో ఇనుము, సిమెంట్‌ వ్యాపారం చేస్తుంటాడు.
చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. వినూత్నం.. ఆసియా దేశాల ప్రతినిధులు ప్రశంసలు  

దీంతో పాటు ఫెర్టిలైజర్స్‌ డీలర్‌షిప్‌ ఉంది. ఒడిశా ప్రాంతం నుంచి ఎటువంటి బిల్లులు లేకుండా సరుకులు రవాణా చేస్తుంటాడనే ఆరోపణలున్నాయి. టీడీపీ హయాంలో ఒడిశా నుంచి సిమెంట్, ఎరువులు, విత్తనాలను ఎటువంటి పత్రాలు లేకుండా లారీల్లో దిగుమతి చేస్తుండేవాడన్న వాదనలున్నాయి. 2021 ఆగస్టులో సుబ్రహ్మణ్యం గోడౌన్‌పై విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. అక్కడ ఈ–వే బిల్లులు లేకుండా ఒడిశా నుంచి సిమెంట్‌ రవాణా చేసినట్లు గుర్తించి రూ.48 వేల జరిమానా విధించారు.

అలాగే  సిమెంట్‌ అక్రమ నిల్వలున్నాయన్న సమాచారంతో గోడౌన్‌లో దాడులు నిర్వహించగా అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన 122 యూరియా బస్తాలు బయటపడ్డాయి. ఇదిలా ఉండగా..  ఏపీ 39 ఎల్‌డబ్ల్యూఎస్‌ 123 నంబర్‌ గల కారుకు పోలీసు నేమ్‌ బోర్డు పెట్టుకుని ఒడిశాలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో ఇటీవల యథేచ్ఛగా తిరుగుతున్నాడు. దీంతో బరంపురం పోలీసులకు అనుమానం వచ్చి ఆయనను విచారించడంతో  నకిలీ పోలీసు నేమ్‌బోర్డు వ్యవహారమని తేలింది.

దీంతో ప్రాథమిక విచారణలో భాగంగా ఈ నెల 2వ తేదీన వాహనాన్ని సీజ్‌ చేసి సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకుని మూడు రోజుల పాటు విచారించారు. 417, 419, 464 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అడ్డగోలు వ్యాపారాల కోసమే ఒడిశాకు వెళ్లారని, ఎవరూ తమను అడ్డుకోరాదనే ఉద్దేశంతోనే పోలీసు నేమ్‌ బోర్డు పెట్టుకుని తిరుగుతున్నారని వాదనలు విన్పిస్తున్నాయి.

మరిన్ని వార్తలు