కూతురి హత్య.. తండ్రికి జీవిత ఖైదు

29 Oct, 2020 15:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు 

సాక్షి, జగిత్యాల : కన్న కూతురుకు వివాహం చేయడం.. ఆమెకు వరకట్నం ఇవ్వడం భారంగా భావించిన తండ్రి, సవతి తల్లి, సవతి తల్లి సోదరుడు సదరు యువతిని హత్య చేసిన ఘటనలో ముగురికీ జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్లకు చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డికి పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన ప్రేమలతతో వివాహమైంది. వీరికి కూతురు మాన్యశ్రీ జన్మించింది. ఆ తర్వాత భా ర్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో మాన్యశ్రీ వివాహానికి ఎంత ఖర్చయినా తానే భరిస్తానని సత్యనారాయణరెడ్డి ఒప్పంద పత్రం రాసిచ్చాడు. కూతురుకి వివాహ వయసు రావడంతో అతను గ్రామంలో ఉన్న తన 20 గుంటల భూమిని విక్రయించాడు.

ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూస్తుండగా హైదరాబాద్‌ నుంచి మంచి సంబంధం వచ్చింది. మగ పెళ్లివారు రూ.25 లక్షల వరకట్నం అడిగారని మాన్యశ్రీ తన తండ్రి సత్యనారాయణరెడ్డికి 07.09. 2015న ఫోన్‌లో తెలిపింది. మరుసటి రోజు అతను కూతురుకు ఫోన్‌ చేసి, 20న వెన్గుమట్లకు రావాలని చెప్పడంతో కరీంనగర్‌ నుంచి వెళ్లింది. అదే రోజు రాత్రి తండ్రి సత్యనారాయణరెడ్డి, సవతి తల్లి లత, సవతి తల్లి సోదరుడు కళ్లెం రాజులు పథకం ప్రకారం మాన్యశ్రీని గొంతు నుమిలి హత్య చేశారు. మృతురాలి తల్లి ప్రేమలత గొల్లపల్లి ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

దర్యాప్తు పూర్తి చేసి, సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో జగిత్యాల సెకండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్‌ జడ్జి జి.సుదర్శన్‌ ముగ్గురు నిందితులకు జీవితఖైదుతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చారు. అప్పటి గొల్లపల్లి ఎస్సై రమేశ్, ధర్మపురి సీఐ వెంకటరమణ, 18 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పీపీ శ్రీవాణి, గొల్లపల్లి కోర్టు కానిస్టేబుల్‌ కిరణ్‌కుమార్‌లను ఎస్పీ సింధూశర్మ అభినందించారు.

>
మరిన్ని వార్తలు