నయవంచకుడు: ప్రేమ, పెళ్లి పేరుతో నగ్న ఫొటోలు, వీడియోలు తీసి

4 Jun, 2021 08:49 IST|Sakshi
అరెస్టయిన భరత్‌ రెడ్డి, స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, గంజాయి

ఫేక్‌ అకౌంట్లతో అమ్మాయిలకు వల

ప్రేమ, పెళ్లి పేరుతో నగ్న ఫొటోలు, వీడియోల సేకరణ

బాధితుల్లో పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు

క్రికెట్‌ బెట్టింగ్, పేకాటతో అడ్డదార్లు

గంజాయి విక్రయాలతో దందా 

అనంతపురం క్రైం: క్రికెట్‌ బెట్టింగ్‌.. పేకాట.. ప్రేమ, పెళ్లి ముసుగులో దగా.. 126 నగ్న ఫొటోలు, వీడియోలతో రూ.5లక్షల వరకు వసూలు.. గంజాయి వ్యాపారం.. ఇలా ఒకటేమిటి, ఎన్నో విధాల మోసాలకు పాల్పడుతున్న ఓ నియవంచకుడిని జిల్లా పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కేజీ గంజాయి, సెల్‌ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం నగరంలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ బి.సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. నగరంలోని భైరవనగర్‌లో నివాసముంటున్న భరత్‌ రెడ్డి బీటెక్‌ మూడో సంవత్సరం వరకు చదివి, ఆ తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశాడు. క్రికెట్‌ బెట్టింగ్, పేకాటకు బానిసయ్యాడు.

సరిపడా డబ్బులు, సంపాదన లేకపోవడంతో నూతన పంథా ఎంచుకున్నాడు. ఫేస్‌బుక్, టిండర్‌ యాప్, తెలుగు మ్యాట్రిమోనిలలో ఫేక్‌ ఐడీలతో అకౌంట్లు సృష్టించాడు. వీటిలో భరత్‌ రెడ్డి పేరుకు బదులుగా సిద్ధార్థ రెడ్డి అని పేరు.. అతని ఫొటోకు బదులుగా ఓ అందమైన వ్యక్తి ఫొటోను ప్రొఫైల్‌గా పెట్టుకున్నాడు. అలా అమ్మాయిలను పరిచయం చేసుకుని నిరంతం వాట్సాప్‌ చాటింగ్, వాయిస్‌ కాల్స్‌ కొనసాగించాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొందరు అమ్మాయిలను నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన నగ్న దృశ్యాలు, రికార్డ్‌లు సేకరించాడు. 

మోసపోయిన 20 మందికి పైగా యువతులు 
ఫేస్‌ బుక్, టిండర్‌ యాప్, మ్యాట్రిమోనీ ద్వారా హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి, విజయవాడ, ప్రొద్దుటూరు, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాలకు చెందిన యువతులను మోసం చేశాడు. అమ్మాయిల నుంచి సుమారు రూ.5 లక్షల వరకు డబ్బును తన బ్యాంకు అకౌంట్లు, ఫోన్‌ పే, గూగుల్‌ పే ద్వారా రాబట్టుకున్నాడు. ఇలా సుమారు 20 మంది అమ్మాయిలు భరత్‌ వలలో మోసపోయారు. వీరిలో ఉన్నత విద్యను అభ్యసించిన యువతులు.. స్టాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు కూడా ఉండటం గమనార్హం. 

రహస్యంగా నగ్న వీడియోల చిత్రీకరణ 
అమ్మాయిలు, మహిళలు స్నానం చేసే సమయంలో దొంగచాటుగా వెళ్లి నగ్న వీడియోలు చిత్రీకరించాడు. దీంతో పాటుగా గంజాయి తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరతో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఇతనిపై ఇప్పటికే అనంతపురం వన్‌టౌన్‌లో కిడ్నాప్‌ కేసు, టూటౌన్‌లో గ్యాంబ్లింగ్‌ కేసులున్నాయి. అనంతపురం రైల్వే స్టేషన్‌ వద్ద గంజాయి విక్రయిస్తున్న భరత్‌ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులు విచారణలో నయవంచన బాగోతం వెలుగు చూసింది. విలేకరుల సమావేశంలో ఏఎస్పీ నాగేంద్రుడు పాల్గొన్నారు.  

అపరిచిత వ్యక్తులతో  స్నేహం ప్రమాదం 
సామాజిక మాధ్యమాల్లో ఫేక్‌ అకౌంట్ల ద్వారా అమ్మాయిలను వంచించడం పరిపాటిగా మారింది. వాట్సాప్‌ చాటింగ్‌లు, వాయిస్‌ కాల్స్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహం ప్రమాదమని గుర్తించాలి. భరత్‌ రెడ్డి బాధితులెవరైనా ఉంటే దిశ డీఎస్పీ ఎ.శ్రీనివాసులను సంప్రదించండి. మహిళల చేతిలో వజ్రాయుధమైన దిశ ఎస్‌ఓఎస్‌ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 
– బి.సత్యయేసుబాబు, ఎస్పీ

చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు   
కృష్ణా జిల్లాలో దారుణం: భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి

మరిన్ని వార్తలు