ఏమీ చేయనని నమ్మించి, ప్రాణాలు తీశాడు

13 Oct, 2020 13:16 IST|Sakshi

ప్రేమ నిరాకరించిందని యువతి సజీవ దహనం

తనూ నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం

ఘటనా స్థలంలో యువతి, ఆస్పత్రిలో యువకుడు మృతి

కృష్ణా జిల్లా విస్సన్న పేటలో ఘటన

సాక్షి, కృష్ణా: ప్రేమ పేరుతో వేధించడమే కాకండా ఓ యువతి పాలిట కాలయముడిగా మారాడు ఓ వ్యక్తి. తన ప్రేమను నిరాకరించడంతో పాటు పోలీసులకు పిర్యాదు చేసిందని కసితో రగిలిపోయి ఆమెపై పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. అంతటితో ఆగకుండా ప్రేయసితో పాటు తనూ నిప్పంటించుకొన్నాడు. ఈ ఘటన సోమవారం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన చిన్నారి అనే యువతి విజయవాడలోని ఓ కొవిడ్ కేర్ సెంటర్‌లో నర్సుగా పని చేస్తోంది.

స్నేహితురాళ్లతో కలిసి ఆస్పత్రికి సమీపంలోనే ఓ గది అద్దెకు తీసుకుని ఉంటోంది. రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి ఆమెను కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో నాలుగు రోజుల కిందట గవర్నర్‌పేట పోలీసుస్టేషన్‌లో చిన్నారి ఫిర్యాదు చేసింది. పోలీసులు నాగభూషణాన్ని పిలిచి హెచ్చరించడంతో ఆమెకు దూరంగా ఉంటానని, ఏమీ చేయనని అతను స్టేట్‌మెంట్‌ రాసి ఇచ్చాడు. దీంతో ఫిర్యాదును చిన్నారి వెనక్కి తీసుకుంది.

అయితే, రోజులానే సోమవారం విధులకు హాజరైన చిన్నారి రాత్రి 8 గంటలకు విధులను ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళుతుండగా.. మాటు వేసిన నాగభూషణం ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నాగభూషణం ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను చిన్నారిపై పోసి నిప్పంటించాడు. తనూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన నాగభూషణాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగభూషణం కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు