పాకిస్తాన్‌ హర్రర్‌: స్నేహితులతో కలిసి భార్యపై ఘాతుకం

12 Jul, 2021 18:17 IST|Sakshi

కరాచీ : పాకిస్తాన్‌లో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ఈ సంఘటన కరాచీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు.. కరాచీలోని షెర్‌పావో కాలనీకి చెందిన ఆసిఫ్‌కు కొద్దినెలల క్రితం అయేషాతో వివాహమైంది. వివాహమైన నాటినుంచి అసిఫ్‌ ఆమెకు నరకం చూపించేవాడు. వ్యభిచారం చేయాలంటూ వేధించేవాడు.  జూన్‌ 23వ తేదీన అసిఫ్‌ ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారందరూ బాగా తాగిఉన్నారు. ఇంటికిరాగానే తన స్నేహితులను సంతోషపరచాలంటూ హుకుం జారీ చేశాడు. ఇందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో వారందరూ కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం కత్తితో పొడిచి చంపి, ముఖంపై ​యాసిడ్‌ పోశారు.

శవాన్ని క్వైదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ డంప్‌యార్డ్‌లో పడేశారు. అయేషా శవం కుళ్లిన స్థితిలో పోలీసులకు లభించింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసిఫ్‌ నిజం ఒప్పుకున్నాడు. ఇంకా.. ‘అసిఫ్‌తో అయేషా పెళ్లి జరగటానికి కొన్ని రోజుల ముందు.. ఓ ఆటో డ్రైవర్‌ అయేషాను కిడ్నాప్‌ చేసి ఇంట్లో బంధించాడు. ఆ ఆటో డ్రైవర్‌ భార్య అయేషాను అసిఫ్‌ తల్లి రహిమాకు 20 వేల రూపాయలకు అమ్మింది. రహిమా.. అయేషాను తన కొడుకు అసిఫ్‌కు ఇచ్చి పెళ్లి చేసింది. అసిఫ్‌కు ఇది రెండో పెళ్లి. అతడు తన మొదటి భార్యను కూడా వ్యభిచారం పేరుతో వేధించటంతో విడిచి వెళ్లిపోయింది’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు