రక్షించినందుకు చెంప దెబ్బలు తిన్న సెక్యూరిటీ గార్డు

29 Aug, 2022 21:21 IST|Sakshi

ఇటీవలకాలంలో చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులంటే చిన్న చూపో ఏంటో తెలియదు. వారిపట్ల చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఐనా మనుషులన్నాక తప్పులు అనేవి సహజం. మందలించి వదిలేయాలి గానీ చేయి జేసుకోవడం అనాగరికం. ఇక్కడొక వ్యక్తి కూడా సెక్యూరిటి గార్డు పట్ల అలానే అనుచితంగా ప్రవర్తించాడు.

వివరాల్లోకెళ్తే...గుర్గావ్‌లోని వరుణ్ నాథ్ అనే వ్యక్తి సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు. వెంటనే సెక్యూరిటీ గార్డు అప్రమత్తమై ఆ వ్యక్తిని రక్షించి బయటకు వచ్చేలా చేశాడు. ఐతే ఆ వ్యక్తి  ఆ ప్రమాదం నుంచి బయటపడి వచ్చిన వెంటనే అదే పనిగా సెక్యూరిటీ గార్డును చెంపదెబ్బలు కొడతాడు. ఆ తర్వాత ఆ లిఫ్‌మ్యాన్‌ని కూడా గట్టిగా కొడతాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో  అపార్ట్‌మెంట్‌ గార్డులు వరుణ్‌నాథ్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు కూడా చేశారు. అంతేగాదు సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల నోయిడాలో  ఒక మహిళ గేట్‌ ఆలస్యంగా తీసినందుకు సెక్యూరిటీ గార్డును దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించి జైలు పాలైన ఘటన మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

(చదవండి: ఆస్ట్రిచ్‌ పక్షిలా దుస్తులు ధరించి... జూలో హల్‌చల్‌! ఎందుకలా చేశాడంటే...)

మరిన్ని వార్తలు