దివ్యాంగ బాలికపై లైంగిక దాడి యత్నం

29 Apr, 2022 11:37 IST|Sakshi

రాజాం సిటీ: చట్టాలు ఎన్ని వచ్చిన మృగాళ్ల ఆగడాలకు అడ్డేలేకుండా పోతోంది.  మండలంలోని కొత్తకంచరాం గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దివ్యాంగ బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనకు సంబంధించి ఎస్సై వీబీ రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగ బాలిక (14) రాజాంలోని  భవిత కేంద్రంలో 8వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ ఆటోలో రాజాం భవిత కేంద్రానికి వస్తూ పోతూ ఉండేది.

రెండు రోజుల క్రితం యథావిధిగా భవిత కేంద్రానికి ప్రతి రోజూ వస్తున్న ఆటోలో వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఆటోకోసం వేచి చూస్తుండగా కొత్తకంచరాం గ్రామానికి చెందిన  సామంతుల హరిబాబు బైక్‌పై వచ్చి ఇంటికి తీసుకువెళ్తానని ఎక్కించాడు. అక్కడినుంచి కంచరాం సమీపంలోని తోటపల్లి కాలువలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి యత్నిస్తుండగా అటుగా వెళ్తున్న  కొంతమంది గమనించి కేకలు వేయడంతో బాలికను  విడిచిపెట్టి పరారయ్యాడు. బాలికను సచివాలయ మహిళా పోలీసుకు స్థానికులు అప్పగించగా వారు రాజాం పోలీసులకు సమాచారం ఇచ్చారు.   బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.  

(చదవండి: సారా ప్యాకింగ్‌ కేంద్రాలపై దాడులు)

మరిన్ని వార్తలు