కదులుతున్న ‘పాముల పుట్ట’

16 Aug, 2020 07:46 IST|Sakshi

తహసీల్దార్‌ నాగరాజు వ్యవహారంలో తవ్వేకొద్దీ అవినీతి

మేడ్చల్‌ కలెక్టర్‌ పేరుతో ఆర్డర్‌ కాపీ, నోట్‌ఫైల్‌ తయారీ

కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

ఇంట్లో సోదాల్లో 28 లక్షల నగదు, 2 కిలోల బంగారం, విదేశీ మద్యం స్వాధీనం

సాక్షి, హైదరాబాద్‌/కీసర/అల్వాల్‌ : ఉన్నతాధికారుల ద్వారా మాత్రమే వెలువడే డ్రాఫ్ట్‌ ఆర్డర్‌ కాపీ, నోట్‌ఫైల్స్‌ను సైతం నకిలీవి సృష్టించి లంచాలు మరుగుతున్నారంటే రెవెన్యూ వ్యవస్థలో అవినీతి ఏ స్థాయిలో తిష్టవేసి కూర్చుందో అర్థం చేసుకోవచ్చు. ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్‌ నాగరాజు వ్యవహారంలో కళ్లు బైర్లుకమ్మే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కీసర మండలం రాంపల్లి దాయరలో పట్టాదారు, కౌలుదారుల మధ్య భూ వివాదం నడుస్తోంది. 19 ఎకరాలకు సంబంధించిన వివాదంలో 8 ఎకరాలకు సంబంధించి పట్టాదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు అనుగుణంగా ఆ భూమిని వారి పేరు మీదకు మార్చాల్సి ఉంది. మరో 11 ఎకరాల వివాదం ఆర్డీఓ పరిధిలో ఉంది.

8 ఎకరాలకు సంబంధించి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు తహసీల్దార్‌ను సంప్రదించి ఈ భూమిని పట్టాదారుల పేర చేయాలని కోరారు. దీనికి తహసీల్దార్‌ రూ.2 కోట్లు డిమాండ్‌ చేశారు. ఇందుకు అవసరమైన, మేడ్చల్‌ కలెక్టర్‌ ద్వారా వెలువడాల్సిన డ్రాఫ్ట్‌ ఆర్డర్‌ కాపీ, నోట్‌ ఫైల్‌ను తన కార్యాలయంలోనే తయారుచేసి, వాటిని తీసుకొని తహసీల్దార్‌ నాగరాజు రియల్టర్‌ కందాడి అంజిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు వచ్చాడు. అప్పటికే రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌యాదవ్‌ అక్కడ డబ్బులతో ఉన్నారు. దీనిపై ఉప్పందుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం నాగరాజును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. 

పత్రాలు సృష్టించినట్టు అంగీకారం!
తహసీల్దార్, వీఆర్‌ఏ, రియల్టర్లను శనివారం ఏసీబీ కార్యాలయంలో విచారించారు. కలెక్టర్‌ పేరిట పత్రాలు సృష్టించినట్టు తహసీల్దార్‌ ఈ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ఇందులో తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, కలెక్టరేట్‌ సిబ్బంది ప్రమేయం ఉందా అనే దానిపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఇదే భూమికి సంబంధించిన 11 ఎకరాలకు ఆర్డీఓ నుంచి ఆదేశాలు రానున్నట్టు విచారణలో తహసీల్దార్‌ చెప్పినట్లు సమాచారం. కాగా, శనివారం ఉదయం కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసీబీ సీఐలు గంగాధర్, నాగేందర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. తహసీల్దార్‌ గదిలో ఉన్న రికార్డులు, కంప్యూటర్‌ రికార్డులు, ఇటీవల తహసీల్దార్‌ చేసిన ముటేషన్లు, రికార్డుల మార్పులు, చేర్పులు, ఫైళ్ల క్లియరెన్స్‌ను పరిశీలించారు.

రాంపల్లి దాయరలోని సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల భూములకు సంబంధించిన కాస్రా పహాణీ నుంచి ఇప్పటివరకు పహాణీ రికార్డులు, నాగరాజు తహసీల్దార్‌గా బాధ్యతలు తీసుకున్నాక రెవెన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులు తదితర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్, తహసీల్దార్‌ బీరువాలో లభించిన పలు ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించి, కొన్నిటిని వెంట తీసుకెళ్లారు. కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసన్న, ఆర్‌ఐ శశికళ ఇతర సిబ్బందిని ప్రశ్నించారు. 

బార్‌గా పెంట్‌హౌస్‌
టెంపుల్‌ అల్వాల్‌లో గల కీసర తహసీల్దార్‌ నాగరాజు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సోదాలు నిర్వహించారు. రూ. 28 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారం లభ్యమయ్యాయి. నాలుగేళ్ల క్రితం శామీర్‌పేట డిప్యూటీ తహసీల్దార్‌ ఉన్న సమయంలో ఇదే ఇంటిపై ఏసీబీ దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ పలు ఆస్తుల దస్తావేజులు దొరికాయి. ఇంటిపైని పెంట్‌హౌస్‌ను బార్‌ గా మలిచారు. పెద్ద మొత్తంలో లభ్యమైన విదేశీ మద్యాన్ని చూసి అధికారులు కంగుతిన్నారు. మూడంతస్తుల ఈ భవనంలో కింది ఫ్లోర్‌లను అద్దెకు ఇవ్వగా మొదటి అంతస్తులో నాగరాజు ఉంటున్నారు. 

నాగరాజు వద్దే ఆ భూముల రికార్డులు: ఆర్డీఓ 
రాంపల్లిదాయరలోని సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల వివాదాస్పద భూములకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులన్నీ తహసీల్దార్‌ నాగరాజు వద్దే ఉన్నాయని కీసర ఆర్డీఓ రవికుమార్‌ తెలిపారు. ఈ వివాదాస్పద భూముల్లోని ఐదెకరాలను ఏసీబీలో పనిచేసి రిటైర్డ్‌ అయిన ఓ ఉన్నతాధికారి రాంపల్లిదాయరకు చెందిన రైతుల నుంచి కొన్నారని, ఆయనకు గతం లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రెవెన్యూ కార్యాలయం నుంచి ఇచ్చారన్నారు. కాగా కీసర తహసీల్దార్‌ నాగరాజు ఇటీవల ఈ పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేయాలని ఓ ఫైల్‌ తయారు చేసి తమ కార్యాలయానికి పంపాడన్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశామన్నారు. ఈ భూములకు సంబంధించిన రికార్డుల మార్పుచేర్పుల్లో తహసీల్దార్‌ పాత్రపై పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు