లైంగిక దాడి; అశ్లీల ఫోటోలు బయటపెడతానని బెదిరింపులు

17 May, 2021 09:59 IST|Sakshi

ముంబై : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళా డాక్టర్‌పై ఐటీ కమిషనర్‌ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరికి మహిళ గర్భం దాల్చి పెళ్లి ప్రస్తావన తేవడంతో ఆమె అశ్లీల ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పుదుచ్చేరికి చెందిన 33 ఏళ్ల మహిళ నాగ్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. 

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ డెరెక్ట్‌ ట్యాక్సెస్‌లో శిక్షణ కోసం 2019లో నాగ్‌పూర్‌ వెళ్లాడు. అనంతరం చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పనిచేసే వైద్యురాలితో పరిచయం ఏర్పడింది. తాను యూపీఎస్పీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు చెప్పడంతో వైద్యురాలికి తన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చాడు. ఈ స్నేహం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకుంటానని భరోసా ఇచ్చి మహిళతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడి.. మహిళ అశ్లీల ఫోటోలను తీసుకొని భద్రంగా దాచుకున్నాడు. ఇటీవల ఆ మహిళ గర్భవతి అవ్వడంతో నిందితుడు ఆమెకు అబార్షన్‌ చేయించాడు. 

బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడంతో ఆమె అశ్లీల చిత్రాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని నిందితుడు బెదిరించాడు. తనను మోసం చేశాడని సదరు మహిళ నాగ్‌పూర్‌ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ సెక్షన్‌ 376 (2) కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు బెంగళూర్‌లో విధులు నిర్వహిస్తున్నాడని, నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని పోలీస్‌ అధికారి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు.

మరిన్ని వార్తలు