నెల్లూరు కాల్పుల ఘటన.. బిహార్‌లో పిస్టల్‌ కొన్న సురేష్‌రెడ్డి!

11 May, 2022 09:07 IST|Sakshi

నెల్లూరు (క్రైమ్‌): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కావ్యారెడ్డిని పిస్టల్‌తో కాల్చి, ఆపై సురేష్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సురేష్‌రెడ్డి బిహార్‌లో పిస్టల్‌ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు నిమిత్తం మంగళవారం అక్కడికి వెళ్లారు.

సురేష్‌రెడ్డి సెల్‌ఫోన్లను సీజ్‌చేసిన పోలీసులు అతడు మాట్లాడిన, చాటింగ్‌ చేసిన వారి వివరాలు, మెస్సేజ్‌లు సేకరించి ఆ దిశగా దర్యాప్తు సాగిస్తున్నారు. అతడి స్నేహితుల వివరాలు సేకరించి పిస్టల్‌పై ఆరాతీస్తున్నారు. çఏడాదిన్నరగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న అతడు గత ఏడాది డిసెంబర్‌లో సుమారు 20 రోజులు బిహార్‌లో ఉన్నాడని, ఆ సమయంలోనే పిస్టల్‌ కొనుగోలు చేశాడని గుర్తించినట్లు తెలిసింది. సాంకేతికతను వినియోగించి ఎవరివద్ద కొనుగోలు చేశాడో కూడా తెలుసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం బిహార్‌ వెళ్లారు. పిస్టల్‌ అమ్మిన వ్యక్తిని పట్టుకుని నెల్లూరు తీసుకొస్తారని తెలిసింది. కొందరు పోలీసులు ముంబై కూడా వెళ్లనున్నట్లు తెలిసింది.

ఐదోసారి తూటా పేలి..
సురేష్‌రెడ్డి వినియోగించిన పిస్టల్‌ 7.5 ఎంఎంగా గుర్తించారు. మ్యాగజిన్‌ సామర్థ్యం 9 బుల్లెట్లు. దా న్లో ఏడు బుల్లెట్లు మాత్రమే ఉంచి నట్లు పోలీసు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కావ్యారెడ్డిపై మొదటిసారి కాల్పులు జరపగా ఆమె తప్పించుకుందని, మరో మూడుసార్లు కాల్చినా తూటాలు పేలలేదని, అయిదోసారి కాల్చడంతో తూటాపేలి కావ్యారెడ్డి తలలోకి దూసుకూళ్లిందని భావిస్తున్నారు. మిస్సయిన, పేలని తూటాలను ఘటనాస్థలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. సురేష్‌రెడ్డి ఆరో రౌండ్‌ కాల్చుకుని మృతిచెందాడు. ఏడో బుల్లెట్‌ పిస్టల్‌లోనే ఉంది. దాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు బుల్లెట్‌లపై నంబర్లను బట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు.

మృతదేహాలకు పోస్టుమార్టం..  
కావ్యారెడ్డి, సురేష్‌రెడ్డి మృతదేహాలకు నెల్లూరు జీజీహెచ్‌లో ఆత్మకూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోలీసులు శవపంచనామా, వైద్యులు పోస్టుమార్టం చేశారు. తాటిపర్తిలో రెండు కుటుంబాల నడుమ వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు