తల్లిదండ్రులు ఇష్టం లేని స్కూల్‌లో చేర్పించారని మనస్తాపం.. భవనంపైనుంచి దూకిన విద్యార్థిని

3 Aug, 2022 09:56 IST|Sakshi

కుషాయిగూడ: తల్లిదండ్రులు తనకిష్టం లేని స్కూల్‌కు వెళ్లామంటున్నారని మనస్తాపం చెందిన పదో తరగతి విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

ఎస్‌ఐ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా దోరదేవరపాడు గ్రామానికి చెందిన నాగళ్ల రవి, రాధ దంపతులు. 17 ఏళ్ల క్రితం నగరానికి వచ్చారు. కాప్రా కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని శ్రీహన్స్‌ వజ్రం అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. రవి వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరి కూతురు కావ్య (15) సైనిక్‌పురి గోకుల్‌నగర్‌లోని సిటీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతోంది. సాకేత్‌లోని విద్యాభారతి స్కూల్‌లో 9వ తరగతి చదివిన కావ్యను.. ఆ పాఠశాల దూరం అవుతుందన్న ఉద్దేశంతో అపార్టుమెంట్‌కు సమీంలోని సిటీ హైస్కూల్‌లో చేర్పించారు. కొత్తగా చేరిన స్కూల్‌లో చదువుకోవడం తనకు ఇష్టం లేదని తిరిగి పాత పాఠశాలలోనే తనను చేర్పించాలని తల్లిదండ్రులతో చెప్పింది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనే ఉంది. స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి ప్రశ్నించాచు. సదరు స్కూల్‌కు వెళ్లడం తనకు ఇష్టం లేదని కావ్య సమాధానం ఇవ్వడంతో కూతురును రవి మందలించాడు.

దీంతో మనస్తాపానికి గురైన కావ్య ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో అపార్టుమెంట్‌ ఎదుట పెద్ద శబ్దం రావడంతో అందరూ బయటకు వచ్చారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న కావ్యను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
చదవండి:  మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని

మరిన్ని వార్తలు