ఓఎల్‌ఎక్స్‌లో.. రూ. 50 వేలకే పల్సర్‌ బైక్‌ ఇప్పిస్తానని చెప్పి..

26 Jul, 2021 10:03 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జిన్నారం(మహబూబ్‌నగర్‌): సెకండ్‌ హ్యాండ్‌ బైక్‌ను కొనుగోలు చేసే విషయంలో రూ.50వేలు నష్టపోయానని మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని బొల్లారం మున్సిపల్‌ పరిధిలో ఆదివారం జరిగింది. బొల్లారం సీఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా విపన్నగాండ్ల గ్రామానికి చెందిన మాండ్ల సురేశ్‌(26) భార్య సౌందర్యలతో కలిసి బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని బీరప్పబస్తీలో నివాసం ఉంటున్నారు.

కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మాండ్ల సురేశ్‌ గత కొంత కాలంగా ఓఎల్‌ఎక్స్‌లో విధులు నిర్వహిస్తున్న అశోక్‌కుమార్‌తో పరిచయం పెంచుకున్నాడు. రూ. 50వేలకే సెకండ్‌ హ్యాండ్‌ పల్సర్‌ బైక్‌ను ఇప్పిస్తానని అశోక్‌కుమార్‌ చెప్పాడు. రెండు నెలల నుంచి దశల వారీగా సురేశ్‌ రూ. 50వేలను అశోక్‌కుమార్‌కు అప్పజెప్పాడు. అనంతరం పది రోజుల నుంచి అశోక్‌కుమార్‌ ఫోన్‌  లేపటం లేదు.

ఫోన్‌  స్విచ్‌ఆఫ్‌ రావటంతో తాను నష్టపోయానని భావించిన సురేష్‌ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ ప్రశాంత్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు