సీసీ కెమెరాలో దృశ్యాలు: ఆ ఘటన వెనుక కుట్ర

8 Oct, 2020 08:48 IST|Sakshi
ప్రధాన నిందితుడు పరమేశ్‌

సీసీటీవీ రికార్డు చేసిన దృశ్యాలతో నిందితుల గుర్తింపు 

వివరాలు వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప 

కర్నూలు: మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర పన్నిన నలుగురు ముఠా సభ్యులను ఆదోని పోలీసులు అరెస్ట్‌ చేసి కటకటాలకు పంపారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ ఎస్సీ యువమోర్చా, ఆదోని పట్టణ ప్రధా న కార్యదర్శి వడ్డెమాను పరమేశ్‌తో పాటు ఆదోని పట్టణానికి చెందిన రవికుమార్, ఉలిద్ర అజయ్, నాగలదిన్నె రామకృష్ణ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రంలో ఎస్పీ ఫక్కీరప్ప ఎదుట హాజరు పర్చారు. వివరాలను ఎస్పీ విలేకరులకు వెల్లడించారు. ఆదోని పట్టణంలోని రణమండల కొండపై ఉన్న మసీదు గోడపై హిందీలో జైశ్రీరామ్, ఓం, కోట ముఖద్వారంపై ఆంగ్లంలో రాం, ఓం అక్షరాలు పెయింట్‌తో గుర్తు తెలియని వ్యక్తులు రాశారని మసీదు ముతవల్లి అబ్దుల్‌ సత్తార్‌ గత నెల 21న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: అనుమతులు గోరంత.. దోచేది కొండంత !

దర్యాప్తులో భాగంగా మసీదు వద్ద అమర్చిన సీసీ ఫుటేజీలను పరిశీలించగా దండుగేరి రవికుమార్, అరుణజ్యోతి నగర్‌ ఉలిద్ర అజయ్‌ మసీదులోని వైర్లను కత్తిరించి కరెంట్‌ సరఫరా నిలిపేసిన దృశ్యాలు లభించాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా బీజేపీ ఎస్సీ యువమోర్చా కార్యదర్శి వడ్డెమాను పరమేశ్‌ డబ్బులిచ్చి నేరానికి ఉసిగొల్పినట్లు అంగీకరించారు. దీంతో నలుగురి నిందితులను అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లతో పాటు నేరానికి ఉపయోగించిన పెయింట్‌ డబ్బా, బ్రష్, మోటారు సైకిల్, ఎలక్ట్రికల్‌ బల్బు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి కొమ్మి ప్రతాప్‌ శివకిశోర్, ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్, ఎస్‌బీ డీఎస్పీ వెంకట్రాది, సీఐ శ్రీధర్, ఆదోని త్రీ టౌన్‌ సీఐ నరేష్‌కుమార్, ఎస్‌ఐ మన్మథవిజయ్‌ పాల్గొన్నారు. (చదవండి: ఆంధ్రాలో చంపి.. తెలంగాణలో పాతి పెట్టారు)

హుండీ కానుకలు చోరీ చేసింది బాలికలే 
నంద్యాల పట్టణం గోపాల్‌నగర్‌ ఆంజనేయస్వామి ఆలయంలో ఉన్న హుండీ కానుకలు చోరీ చేసింది ఇద్దరు బాలికలేనని ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. ఈ నెల 2న హుండీని ధ్వంసం చేసి సుమారు రూ.35 వేల కానుకలు దొంగలించారని పూజారి సాకుత్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు నంద్యాల 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించగా చిత్తుకాగితాలు ఏరుకునే బండి ఆత్మకూరు మండలం పర్నపల్లి గ్రామానికి చెందిన బాలిక(15), నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన మరో బాలిక(15) ఆలయంలోకి ప్రవేశించి వారి సంచుల్లో ఉన్న ఇనుపరాడ్‌తో హుండీని పెకిలించి నగదు, కానుకలను మూటకట్టుకుని ఉడాయించిన దృశ్యాలు లభ్యమయ్యా యి. పక్కా ఆధారాలతో బాలికలను అరెస్ట్‌ చేసి బుధవారం ఎస్పీ ఎదుట హాజరు పరచగా ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. అనంతరం బాలికలను కర్నూలులోని బాలల పరిశీలన గృహానికి తరలించారు. సమావేశంలో నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి, నంద్యాల 2వ పట్టణ సీఐ కంబగిరి రాముడు పాల్గొన్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా