అర్ధరాత్రి ఘోర ప్రమాదం

22 Nov, 2022 03:36 IST|Sakshi

జాతీయ రహదారిపై చెరకు ట్రాక్టర్‌ను ఢీకొట్టిన గరుడ బస్సు

ముగ్గురి దుర్మరణం.. 16 మందికి తీవ్రగాయాలు

ఇందులో నలుగురి పరిస్థితి విషమం

వనపర్తి జిల్లా ముమ్మళ్లపల్లి వద్ద ఘటన 

కొత్తకోట: అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చెరకు లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గరుడ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

కొత్తకోట ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. మియాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ బస్సు 48 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ముమ్మళ్లపల్లి సమీపంలో జాతీయ రహదారిపై చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన గరుడ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ గాడ్ల ఆంజనేయులు (42), క్లీనర్‌ తుప్పతూర్తి సందీప్‌యాదవ్‌ (19), వడ్డె శివన్న(47) అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతిచెందారు.

మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించిన వారిని బంధువులు హైదరాబాద్‌లోని ఆస్పత్రులకు తరలించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు. కాగా, ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. 

భారీగా నిలిచిన ట్రాఫిక్‌
ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంటలపాటు వాహనాలు ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి, కొత్తకోట సీఐ శ్రీనివాస్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. భారీ క్రేన్‌ సహాయంతో బస్సును పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు.

మృతుల్లో బస్సుడ్రైవర్‌ ఆంజనేయులుది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం కాగా.. క్లీనర్‌ సందీ‹ప్‌యాదవ్‌ మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మునగలవేడు వాసి. ప్రయాణికుడు శివన్నది ఏపీలోని అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం వెంకటంపల్లిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ ఆంజనేయులు, క్లీనర్‌ సందీప్‌ మృతిచెందడంతో హైదరాబాద్‌లోని మియాపూర్‌ డిపో సిబ్బంది వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చదవండి: అద్దె బస్సులు కొంటాం!

మరిన్ని వార్తలు