సైనికుడే నేరస్తుడిగా మారి..

22 Mar, 2021 04:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మావోయిస్టునంటూ బంగారు వ్యాపారిని రూ.5 కోట్లు డిమాండ్‌ 

విజయనగరం క్రైమ్‌: ఆర్మీలో పనిచేస్తున్న ఓ సైనికుడు వ్యాపారిని బెదిరించి పోలీసులకు పట్టుబడిన ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎస్పీ బి.రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మండలం బంటువానివలస గ్రామానికి చెందిన చందనా పల్లి రాజేశ్వరరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. సె లవుపై వచ్చిన అతడు స్థలం కొనుగోలు, విక్ర యంలో రూ.22 లక్షలు నష్టపోయాడు. దాన్ని భర్తీ చేసుకునేందుకు మావోయిస్టు నాయకుడిగా అవతారమెత్తాడు. ఉత్తరప్రదేశ్‌లో కొనుగోలు చేసిన పిస్టల్‌తో పార్వతీపురానికి చెందిన బంగారు వ్యాపారి ఇందుపూరు చినగుంపస్వామి అలియాస్‌ బాబు ఇంటి కిటికీ అద్దాలపై ఈ నెల 6న అర్ధరాత్రి కాల్పులు జరిపాడు. మరుసటి రోజు వ్యాపారికి ఫోన్‌ చేసి జార్ఖండ్‌ మావోయిస్టు కమాండర్‌గా పరిచయం చేసుకున్నాడు.

కాల్పులు జరిపినది తనేనని, రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ విషయంపై పోలీసులకు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు రూ.1.5 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. నిందితుడు వ్యాపారికి ఆదివారం ఫోన్‌చేసి డబ్బును విక్రం పురం–డంగభద్ర గ్రామాల మధ్యలోని కొండ ప్రాంతానికి తీసుకురావాలని చెప్పాడు. పోలీసులు మాటువేసి నిందితుడిని పట్టుకున్నారు. 

మరిన్ని వార్తలు