దాడి చేసింది టీడీపీ నేత అనుచరుడే 

29 Sep, 2020 04:28 IST|Sakshi
టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌తో ప్రతాప్‌రెడ్డి (ఫైల్‌)

ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు అవాస్తవం 

నిందితుడి అరెస్ట్‌: ఎస్పీ సెంథిల్‌కుమార్‌

మదనపల్లె టౌన్‌ (చిత్తూరు జిల్లా): సస్పెండ్‌ అయిన న్యాయమూర్తి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర (42)పై జరిగిన దాడిలో రాజకీయ కోణం లేదని, దాడికి పాల్పడిన యువకుడు తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ అనుచరుడేనని జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. రామచంద్రపై జరిగిన దాడికి టీడీపీయే కారణమైనప్పటికీ ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసి, వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన దాడికి సంబంధించిన కారణాలను మదనపల్లెలో సోమవారం ఎస్పీ ఆధారాలతో తెలియజేశారు.  

► రామచంద్రపై దాడి ఘటనపై పోలీసుల నోటీసుకు వచ్చిన వెంటనే డీఎస్పీ రవిమనోహరాచారి అనారోగ్యంగా ఉన్నప్పటికీ దర్యాప్తు చేశారు. 
► ఘటనా స్థలంలో సెల్‌ఫోన్లో కొందరు తీసిన వీడియోలు సేకరించి, దాడికి పాల్పడిన ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి, నిజాలు తెలుసుకుని కేసు నమోదు చేశారు. 

ప్రతాప్‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అనుచరుడు 
దాడికి పాల్పడిన ప్రతాప్‌రెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌ అనుచరుడని తేలినట్టు ఎస్పీ తెలిపారు. ప్రతాప్‌ రెడ్డి తల్లి విజయలక్ష్మి తెలుగుదేశం పార్టీ తరపున అక్కడి ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. ప్రతిపక్ష పార్టీ చేసిన దుష్ప్రచారం వెనుక ఎవరెవరు ఉన్నారో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తాలా చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు