ఫేస్‌బుక్‌ లైవ్‌: ‘అమ్మాయిని దూరం చేసి.. సిరిసిల్ల టౌన్‌ సీఐ వేధిస్తున్నాడు.. విషం తాగి చనిపోతున్నా’

23 Nov, 2021 10:34 IST|Sakshi

ఫేస్‌బుక్‌ లైవ్‌లో విషం తాగిన యువకుడు

ప్రేమించిన యువతిని దూరం చేశారని ఆరోపణ 

సిరిసిల్ల: పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆరోపిస్తూ.. ఓ యువకుడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు గొలిసెల దిలీప్‌ (23) ట్రాక్టర్‌ డ్రైవర్‌. తనను సిరిసిల్ల టౌన్‌ సీఐ అనిల్‌కుమార్‌ వేధిస్తున్నాడని, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించాడని, మళ్లీ తనపై మరో కేసు నమోదు చేశాడని లైవ్‌లో ఆరోపించాడు.

వేములవాడ శివారులోని చింతలఠాణాకు చెందిన యువతిని ప్రేమించానని, సదరు యువతితో కలిసి ఉన్న ఫొటోలను పోలీసులు తొలగించారని, ఆమెను వదిలివేయాలని, మరచిపోవాలని వేధిస్తున్నారని పేర్కొన్నాడు. రౌడీషీట్‌ తెరుస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పాడు. సదరు యువతిని వేధిస్తున్నానంటూ గతంలో కూడా ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆదివారం మరో కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు రావాలని బెదిరించారని, దీంతో తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఫేస్‌బుక్‌ లైవ్‌లో పురుగుల మందు తాగాడు. బస్వాపూర్‌–నేరెళ్ల గ్రామాల మధ్య దిలీప్‌ ఉన్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న దిలీప్‌ను సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దిలీప్‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేశాడు 
యువతి ఫొటోలు తీసి దిలీప్‌ ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఈ విషయంలో గతంలో పోలీసు కేసు నమోదైంది. జైలుకు వెళ్లి వచ్చా డు. అయినా మళ్లీ అతడి వేధింపులు తగ్గకపోవడంతో షీ–టీమ్‌ను ఆశ్రయించారు. షీ–టీమ్‌ సూచనలతో అతడిపై మరో కేసు నమోదు చేశాం. యువతిని వేధిస్తున్న అంశంలో చట్టబద్ధంగానే వ్యవహరించాం. అతన్ని మేం వేధించలేదు.     
– అనిల్‌కుమార్, సిరిసిల్ల టౌన్‌ సీఐ  

మరిన్ని వార్తలు