ఏటీఎంలో రూ.14 లక్షలు చోరీ.. సీసీ కెమెరాలకు రంగేసి

26 Dec, 2022 12:04 IST|Sakshi
నీలగిరిలో తెగబడిన దుండగులు

సాక్షి, నల్గొండ: నీలగిరిలో దుండగులు తెగబడ్డారు. గుర్తు తెలియకుండా సీసీ కెమెరాలకు నల్ల రంగు వేసి.. ఏటీఎం(ఆటోమెటిక్‌ టెల్లర్‌ మిషన్‌)ను గ్యాస్‌ కట్టర్‌తో తెరిచి సుమారు రూ.14లక్షల నగదును అపహరించుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ పట్టణం మిర్యాలగూడ రోడ్డు బీటీఎస్‌ ప్రాంతంలో గల ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలోని శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు చొరబడ్డారు. అయితే, దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా ముందు జాగ్రత్తగా ఏటీఎం వెలుపల, లోపల ఉన్న మొత్తం నాలుగింటికి నల్లరంగు వేశారు. అనంతరం గ్యాస్‌ కట్టర్‌ సహాయంతో ఏటీఎం తెరిచి నగదును అపహరించుకుపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. 

అంతర్‌ రాష్ట్ర ముఠా పనేనా ?
జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే మిర్యాలగూడ రోడ్డులోని ఏటీఎంలో దుండగులు చోరీకి పాల్పడడం పోలీసులను కలవరపాటుకు గురిచేస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు కొత్త ఏటీఎంను వదిలేసి పాత ఏటీఎంను గ్యాస్‌ కట్టర్‌తో తెరిచి చోరీకి పాల్పడిన తీరు అంతర్‌రాష్ట్ర ముఠా పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేస్తే వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులతో పాటు పోలీసులను అప్రమత్తం చేసే పరిజ్ఞానం ఉంటుందని, అది తెలిసే దుండగులు పాత ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. 

ఆధారాల సేకరణ
తెల్లవారుజామున బీటీఎస్‌ ప్రాంతంలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించడంతో ఏటీఎంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం మేరకు వన్‌ టౌన్‌ సీఐ గోపి, టూటౌన్‌ ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి చోరీ జరిగిన ఏటీఎం కేంద్రాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీంను రప్పించి దుండగులు వేలిముద్రలు, పాదముద్రలు, తల వెంట్రుకలు తదితర కీలక ఆధారాలు సేకరించారు. అయితే, చోరీ ఆదివారం తెల్లవారుజామున 2 గంటల నుంచి 5గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సమీప ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   
చదవండి: రోడ్డు మార్గంలో భద్రాచలానికి రాష్ట్రపతి.. ముర్ము ప్రయాణించేది ఈ కారులోనే 

మరిన్ని వార్తలు