నూరేళ్ల ఆశలు సమాధి...భర్త, పిల్లలు కళ్లెదుటే...

23 May, 2022 11:15 IST|Sakshi

ఆరిలోవ (విశాఖ తూర్పు): రోజంతా తల్లితో సరదాగా గడిపాడు. సాయంత్రం అన్నయ్యతో కలిసి ఆడుకున్నాడు. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారనుకుని  సంబరపడిన ఆ తల్లికి ఒక్కసారిగా షాక్‌ తగిలింది. తన చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. జీవీఎంసీ 13వ వార్డు పరిధి విశాఖ కేంద్ర కారాగారం పక్కన శ్రీకృష్ణాపురంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన స్థానికులను కంటతడిపెట్టించింది.

వివరాల్లోకి వెళ్తే... ఈ కాలనీలో గుబ్బల నాగమణి కొన్నాళ్లుగా ఇద్దరు కుమారులతో భర్తకు దూరంగా నివాసముంటుంది. పెద్ద కుమారుడు(4), చిన్న కుమారుడు(2) తల్లితోపాటు ఆదివారం మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఇంట్లోనే ఇద్దరూ కలిసి  ఆడుకున్నారు. ఆటాడుతుండగా చిన్న కుమారుడు గగన్‌(2)కు ఓ మేకు దొరికింది. ఆ మేకును తీసుకెళ్లి ఎలక్ట్రికల్‌ స్విచ్‌ బోర్డులో పెట్టడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు.

వెంటనే బాలుడి తల్లి గమనించి స్థానికుల సహాయంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దారిలోనే ప్రాణాలు విడిచిపెట్టడంతో తిరిగి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అంతవరకు సరదాగా ఆడుకొన్న తన కుమారుడు మృతి చెందడంతో నాగమణి కన్నీటిపర్యంతమైంది. ఆమె వేదన స్థానికులను కంటితడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఆరిలోవ పోలీసుల కేసు నమోదు చేశారు. 

భర్త, పిల్లలు కళ్లెదుటే... 
పీఎం పాలెం (భీమిలి): మారికవలస కూడలికి సమీపంలోని పెట్రోలు బంకుకు ఎదురుగా జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ వివాహిత ప్రమాద స్థలిలోనే ప్రాణాలు విడిచింది. పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బుడతనాపల్లికి చెందిన గొర్లె అర్జునరావు, భార్య స్వర్ణ(30) కుటుంబంతో ఉద్యోగరీత్యా సబ్బవరంలో నివసిస్తున్నారు.

ఇద్దరూ ఉద్యోగులే. అర్జునరావు సబ్బవరంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భార్య స్వర్ణ వీఎంఆర్‌డీఏ ఉద్యోగి. ప్రస్తుతం వుడా పార్కులో టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌లో పని చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం బుడతనాపల్లి నుంచి నగరంలోని ఆరిలోవలో అత్తవారింటికి భార్య స్వర్ణ, కుమారుడు(4), కుమార్తె(8), అంతే వయసున్న అన్న కూమార్తెతో అర్జునరావు బైక్‌పై బయలుదేరాడు. వీరు మారికవలస కూడలికి సమీపంలో పెట్రోలు బంకుకు ఎదురుగా వచ్చేసరికి అదే రోడ్డులో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది.

దీంతో వెనుక కూర్చున్న స్వర్ణ పడిపోగా ఆమె పైనుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించింది. మిగిలిన వారు స్వల్ప గాయాలతో  బయటపడ్డారు. కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో పిల్లలిద్దరూ షాక్‌కు గురయ్యారు. పీఎం పాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి భర్త అర్జునరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్‌ తెలిపారు.

దూసుకొచ్చిన మృత్యుదేవత 
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): లారీ బ్రేకులు ఫెయిలై మృత్యుదేవతలా దూసుకొచ్చి యువకుడి ప్రాణాలు బలిగొంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెదవాల్తేరు అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తగా పనిచేస్తున్న అత్తోట కన్నా వెంకటరత్నం ఇద్దరు కుమారులతో కలిసి నేతాజీవీధిలో నివసిస్తున్నారు. చినవాల్తేరులో గల శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆమె, చిన్న కుమారుడు కనకరాము (32) కనకమహాలక్ష్మి అమ్మవారి మాల ధరించారు. కుమారుడు వెల్డర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో అమ్మవారి దేవస్థానంలో ఆదివారం జరిగిన హోమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఉదయం 11 గంటల సమయంలో వెంకటరత్నం ఆలయంలో వుండిపోగా, కనకరాము నేతాజీవీధిలో గల ఇంటికి కాలినడకన బయలుదేరాడు. ఇంతలో ఓ క్వారీ లారీ చినవాల్తేరు పాత సీబీఐ డౌన్‌ మీదుగా నేతాజీవీధివైపు వస్తూ బ్రేకులు ఫెయిలవ్వడంతో అతివేగంగా దూసుకొచ్చింది. గమనించిన పాదచారులు కేకలు వేస్తూ పరుగులు తీశారు. కనకరాము కూడా కాలువ మీదకు వెళ్లిపోయినా అప్పటికే లారీ బలంగా ఢీకొనడంతో శరీరంపై పెద్ద గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

లారీకి, కాలువకు మధ్య కనకరాము ఇరుక్కుపోయి మరణించడం స్థానికులను కలిచివేసింది. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు ఇళ్లలోంచి భయాందోళనలతో బయటకి వచ్చారు. సంఘటన స్థలాన్ని మూడో పట్టణ సీఐ కోరాడ రామారావు, త్రీ టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ ఏవీ లీలారావు, ట్రాఫిక్‌ ఎస్‌ఐ అసిరి తాత, త్రీటౌన్‌ ఎస్‌ఐలు జె.ధర్మేంద్ర, హరీష్‌ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. డ్రైవర్‌ దుర్గాప్రసాద్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఈ కేసుని త్రీటౌన్‌ సీఐ రామారావు పర్యవేక్షణలో ఎస్‌ఐ హరీష్‌ దర్యాప్తు చేస్తున్నారు.   

(చదవండి: గ్రామగ్రామానికీ ఇంటర్నెట్‌ )

మరిన్ని వార్తలు