బడికి బయలుదేరి..మృత్యు ఒడికి

21 Dec, 2021 03:30 IST|Sakshi
రాకేశ్‌(ఫైల్‌) ప్రదీప్‌(ఫైల్‌)  

ముగ్గురు అన్నదమ్ముల మృతి

గతంలో తండ్రులను కోల్పోయిన పిల్లలు

మెదక్‌ జిల్లా చేగుంటలో విషాదం

చేగుంట (తూప్రాన్‌): ఇద్దరు తమ్ముళ్లను అన్న బైక్‌పై ఎక్కించుకున్నాడు. స్కూల్లో దింపడానికని బయలుదేరాడు. అప్పుడే అకస్మాత్తుగా వచ్చిందో మాయదారి లారీ. వేగంగా బైక్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలై ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు. మెదక్‌ జిల్లా చేగుంటలోని జీవిక పరిశ్రమ వద్ద సోమవారం జరిగిందీ ప్రమాదం. 

గేటు నుంచి లారీ అకస్మాత్తుగా వచ్చి..
మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లి తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన పండ్ల రాకేశ్‌ (20).. తన సొంత తమ్ముడైన ప్రదీప్‌ (15)తో పాటు వరుసకు తమ్ముడైన పండ్ల రాజు (14)ను చేగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దింపడానికి సోమవారం బైక్‌పై బయలుదేరాడు.

చేగుంట శివారులోకి రాగానే జీవిక పరిశ్రమ గేటు నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చిన లారీ.. బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేశ్‌ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన ప్రదీప్, రాజులను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. 

రెండు కుటుంబాల్లో తల్లులే ఇంటి పెద్దగా..
రాకేశ్‌ పాలిటెక్నిక్, తమ్ముడు ప్రదీప్‌ 10వ తరగతి చదువుతున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో వీళ్లను తల్లి చంద్రకళ పోషిస్తోంది. ఇద్దరికి ఒక సోదరి ఉన్నారు. పండ్ల రాజు 8వ తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి చిన్నతనంలోనే చనిపోగా తల్లి పెంటమ్మ పోషిస్తూ చేగుంటలో చదివిస్తోంది. రాజుకు ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. ఇంటి నుంచి బయలుదేరిన పిల్ల లు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

పరిశ్రమ ఎదుట గ్రామస్తుల నిరసన
ప్రమాద స్థలానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు పరిశ్రమ ఎదుట నిరసన తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల శాఖ అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు ప్రమాద స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. తగిన న్యాయం చేస్తామని పరిశ్రమ యాజమాన్యం హామీ ఇవ్వడంతో పాటు అంత్యక్రియలకు చెరో రూ. 50 వేలు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు