TS: నమ్మలేక.. లేఖ అడుగుతున్నాం

21 Dec, 2021 03:35 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న నిరంజన్‌రెడ్డి. చిత్రంలో గంగుల, జగదీశ్‌రెడ్డి, కేకే, నామా, వేముల

నోటి మాట కాదు లిఖితపూర్వక హామీ ఇవ్వండి

అదనపు ధాన్యం సేకరణపై కేంద్రాన్ని డిమాండ్‌ చేసిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు 

నేటితో 60 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం పూర్తవుతుంది

సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన మేరకంటే అధికంగా వచ్చే ధాన్యాన్ని సేకరించే విషయమై రాష్ట్రానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఎంతైనా కొంటామని నోటి మాటలు చెబితే కుదరదని, అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? 
మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తామని కేంద్రం చెప్పింది. కేంద్రంతో ఎంఓయూ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలని కోరారు. కొనుగోళ్లు మొదలయ్యాక దీనిపై చర్చిద్దామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పటికే 55 లక్షల టన్నుల సేకరణ పూర్తవగా, మంగళవారానికి కేంద్ర లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తవుతాయి. అయితే కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వరి కోతలు జరిగితే మరో 5 లక్షల మెట్రిక్‌ టన్నులు వచ్చే అవకాశం ఉంది.

అందువల్ల అదనంగా కొనుగోళ్లు చేస్తామని కేంద్రం నోటిమాటలు చెబితే చెల్లుబాటు కాదు. ఎంత వస్తే అంత తీసుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి..’అని డిమాండ్‌ చేశారు. అదనంగా వచ్చే ధాన్యాన్ని రాష్ట్రం సేకరించాక కేంద్రం డబ్బులు ఇవ్వకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు ఉన్న దృష్ట్యా లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని చె ప్పారు. ఈ అంశాన్ని రైతు ప్రయోజనాల కోణంలో చూడాలని కోరారు. కేంద్రమంత్రి కలిసే వరకు మంత్రులు వేచి చూస్తున్నారని స్పష్టం చేశారు.

కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి 
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత వానాకాలం సేకరణపై తాము నిలదీస్తుంటే, ఆయన గత యాసంగి సేకరణపై మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్‌ టన్నుల «ధాన్యం మిల్లింగ్‌ చేస్తున్నా, ఎఫ్‌సీఐ మాత్రం నెలకు 5 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటోందని, దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ధాన్యం సేకరణ పెరుగుతున్నా, కేంద్రం అదనంగా ఒక్క గోదామును ఎందుకు కట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు.  

మంత్రులకు టైమ్‌ ఇవ్వని పీయూష్‌ 
మూడురోజులుగా ఎదురుచూపులు 
 నేటి మధ్యాహ్నం భేటీకి అవకాశం 
సాక్షి  న్యూఢిల్లీ:  ప్రస్తుత వానాకాలంలో అదనపు ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సోమవారం కూడా సమయమివ్వలేదు. ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం శనివారం నుంచి మంత్రులు వేచి చూస్తున్నారు. సోమవారం పార్లమెంట్‌లో ఏదో ఒక సమయంలో కలుస్తానని పీయూష్‌ సమాచారం ఇచ్చారు. దీంతో సోమవారం రోజంతా మంత్రులు ఎదురుచూసినా సమావేశం మాత్రం ఖరారు కాలేదు.


కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో ఎంపీ కేకే

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పార్లమెంట్‌ ఆవరణలో పీయూష్‌ను కలిసి మంత్రుల బృందానికి సమయమివ్వాలని కోరారు. బిజీ షెడ్యూల్‌ కారణంగా సోమవారం కుదరదని చెప్పిన ఆయన.. మంగళవారం అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులతో ఏర్పాటు చేసిన భేటీకి ముందు రాష్ట్ర మంత్రులను కలిసేందుకు సమయమిస్తానని చెప్పినట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు పీయూష్‌ను కలిసే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు