20మంది రైతులతో నదిలో పడిపోయిన ట్రాక్టర్‌.. ఐదుగురు గల్లంతు

28 Aug, 2022 10:49 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 20 మంది రైతులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్‌ వంతెనపై నుంచి గర్రా నదిలో పడిపోయింది. ఈ ప్రమాందంలో ఇప్పటి వరకు ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురు గల్లంతయ్యారు. మరో 14 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన బాధితుడు ముకేశ్‌గా గుర్తించినట్లు తెలిపారు హర్దోయ్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అవినాశ్‌ కుమార్‌. 

‘ట్రాక్టర్‌ ట్రాలీలో వెళ్తున్న 20 మంది గర్రా నదిలో పడిపోయినట్లు సమాచారం అందింది. వారిలోంచి 14 మందిని సురక్షితంగా కాపాడారు. ముకేశ్‌ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నా’మని తెలిపారు అవినాశ్‌ కుమార్. సంఘటనా స్థలంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, పీఏసీ బలగాలను మోహరించినట్లు చెప్పారు. ట్రాక్టర్‌, ట్రాలీని స్వాధీనం చేసుకున్నామని, గల్లంతైన వారందరినీ వెలికితీసిన తర్వాతే ఆపరేషన్‌ పూర్తవుతుందన్నారు. 

ఏం జరిగింది?
బెగ్రాజ్‌పుర్‌ గ్రామానికి చెందిన రైతులు తమ పంటను సమీపంలోని మార్కెట్లో విక్రయించి ట్రాక్టర్‌లో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో పాలీ ప్రాంతంలో గర్రా నదిపై ఉన్న వంతెనపైకి రాగానే ట్రాక్టర్‌ టైర్‌ పేలింది. దీంతో అదుపు తప్పి ట్రాక్టర్‌ నదిలోకి దూసుకెళ్లింది.

ఇదీ చదవండి: భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి 

మరిన్ని వార్తలు