బట్టబయలైన నిత్యపెళ్లికూతురి బాగోతం

27 Jul, 2020 13:40 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: జిల్లాలోని దొనకొండలో ఓ నిత్య పెళ్లి కూతురు బాగోతం బట్టబయలైంది. మ్యాట్రిమోని వెబ్‌సైట్లలో జీవితంలో సెటిల్ అయిన అబ్బాయిలను చూడటం. పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం. ఆతరువాత  బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఈ నిత్యపెళ్లి కూతురికి వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా అడ్డం తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్. అయితే, ఇటీవల ఆమె ఘనకార్యంపై మూడో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. తిరుపతికి చెందిన యువతి పతంగి స్వప్న, అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమూరారి స్వప్న. ఇలా పేర్లు మార్చి ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రిమోని వెబ్ సెట్లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి ఆర్థికంగా ఉన్నవారికి నమ్మించి బుట్టలో పడేస్తుంది.

పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేసి తర్వాత వేరుగా ఉంటానని, సెటిల్‌మెంట్‌ చేసుకుంటుంది. ఇలా ఇప్పటికే గత ఏడాది డిసెంబరులో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. మూడు నెలలపాటు వారు హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. డెన్మార్క్‌లో ఉద్యోగం చేసే రామాంజనేయులు స్వప్నను అక్కడకు తీసుకెళ్లేందుకు ప్లాన్‌ చేశాడు. అయితే ఆమె తనతో వెళ్లేందుకు నిరాకరించింది. పాస్‌పోర్టుకు ఇప్పుడే దరఖాస్తు చేయలేనని కొన్ని పనులు ఉన్నాయని తెలిపింది. దీంతో రామాంజనేయులు  ఒక్కడే డెన్మార్క్ వెళ్లాడు. కానీ, స్వప్న వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన ఆ యువకుడు అసలు విషమేంటనే కోణంలో కూపీ లాగాడు.
(ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో)

దాంతో స్పప్న లీలలు వెలుగు చూశాయి. రామాంజనేయులు కంటే ముందు మరో ఇద్దరిని ఆమె వివాహం చేసుకున్నట్టు తెలిసింది. చిత్తూరుకు చెందిన పృద్వీరాజ్, ఆత్మకూరుకు చెందిన సుధాకర్ అనే మరో ఇద్దరితో ఆమెకు గతంలో వివాహమైనట్టు రామాంజనేయులు గుర్తించాడు. పృధ్వీపై తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్‌ స్వప్న కేసు కూడా పెట్టినట్టు తెలుసుకున్నాడు. అంతే కాదు తిరుపతికి చెందిన ఓ మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమె రూ.ఆరు లక్షలు వసూలు చేసిన ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై తిరుపతి సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. వివరాలన్నీ తెలిశాక రామాంజనేయులు  స్వప్నని  నిలదీశాడు. దాంతో పెళ్లి చేసుకున్నావు కాబట్టి రూ.30 లక్షలు ఇచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని స్వప్న డిమాండ్ చేసింది. అతను బెదిరింపులకు లొంగకపోవడంతో దొనకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరోవైపు స్వప్న వ్యవహారంపై రామాంజనేయులు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో స్వప్న చీటింగ్‌ బయటపడింది. రామాంజనులు డెన్మార్క్‌ నుంచి రావాల్సి ఉంది.
(రైతు నాగేశ్వర్‌రావుకు ఏపీ ప్రభుత్వం సాయం వివరాలు)

మరిన్ని వార్తలు