ఎక్సైజ్‌ అధికారి కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌.. మహిళ మృతి

2 Dec, 2023 07:38 IST|Sakshi

కాజీపేట: ఓ ఎక్సైజ్‌ అధికారి కుమారుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేసి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు. రోడ్డు పక్కన నిల్చున్న మహిళను నేరుగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈఘటన గురువారం జరగగా, బంధువులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కాజీపేట–ఫాతిమానగర్‌  ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆందోళనకు  దిగారు. దీంతో దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. కాజీపేట 48వ డివిజన్‌ శౌరినగర్‌ కాలనీకి చెందిన గాదె కవిత (38) గురువారం మధ్యాహ్నం సెయింట్‌ గ్యాబ్రియల్‌ ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు భర్తతో కలిసి వచ్చి రోడ్డుపక్కన నిలబడి ఉంది. ఇదే సమయంలో దర్గా కాజీపేట వైపు వెళ్తున్న ఓ కారు అతివేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కవితను స్థానికుల సహాయంతో భర్త ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. 

డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే కవిత మృతి..
ఎక్సైజ్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కుమారుడు దొడ్ల వంశీ భార్గవ్‌ అతి వేగంగా కారును డ్రైవ్‌ చేసి ఢీకొట్టడంతో కవిత తీవ్రంగా గాయపడి మృతిచెందింది. విదేశాల్లో ఉంటూ ఇటీవలే వివాహా వేడుక నిమిత్తం వచ్చిన వంశీ అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 

మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన..
నిందితుడు ఎక్సైజ్‌ అధికారి కుమారుడు కావడంతోనే అతడిని కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఫాతిమానగర్‌ రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జితో పాటు కాజీపేట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట శుక్రవారం ఆందోళనకు దిగారు. వందల మంది తరలి వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగడంతో పోలీసులు ట్రాఫిక్‌ను దర్గా కాజీపేట మీదుగా మళ్లీంచారు. పోలీస్‌ అధికారులు జోక్యం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి న్యాయం చూస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. మృతురాలికి ఆడపిల్లలు, భర్త ఉన్నారు.

నిందితుడిపై కేసు నమోదు..
కారును నిర్లక్ష్యంగా నడిపి మహిళ మృతికి కారణమైన వంశీ భార్గవ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చారు. మృతురాలి భర్త జోసఫ్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ సార్ల రాజు తెలిపారు.

దర్గా రైల్వేగేట్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌
కాజీపేట రూరల్‌ : కాజీపేట సెయింట్‌ గాబ్రియల్‌ స్కూల్‌ వద్ద కారు ఢీకొని మహిళ మృతి చెందిన ఘ టనలో శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం చేయాలని ఫాతిమానగర్‌ బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది ప డ్డారు. అన్ని వర్గాల వాహనదారులు దర్గా రైల్వే గేట్‌ నుంచి భట్టుపల్లి, కడిపికొండ బ్రిడ్జి మీదుగా బాపూజీనగర్‌ సెంటర్‌ మీదుగా కాజీపేటకు చేరుకున్నా రు. దీంతో సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు ఫాతిమానగర్, దర్గా రోడ్లు, దర్గా రైల్వే గేట్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో వాహనాదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొందరు పాదచారులు, విద్యార్థులు, ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొకొని ఫాతిమానగర్‌ బ్రిడ్జి కింద నుంచి రైలు పట్టాలు దాటి వెళ్లారు.  

మరిన్ని వార్తలు