పహాడీషరీఫ్‌: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు

31 Aug, 2021 12:32 IST|Sakshi

పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌  పరిధిలో ఘటన

38 రోజుల వ్యవధిలో నాలుగు హత్యలు

భయాందోళనలో స్థానికులు  

సాక్షి, హైదరాబాద్‌: మహిళా పూజారి దారుణ హత్యకు గురైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల కాలనీ నుంచి మామిడిపల్లి వెళ్లే దారిలో ఉన్న రంగనాయకుల దేవాలయంలో కౌశిక్‌ శోభాశర్మ(76), ఆమె కుమారుడు మనోజ్‌ శర్మ పూజారులుగా కొనసాగుతున్నారు. కుటుంబం మొత్తం నగరంలో నివాసం ఉంటుండగా శోభాశర్మ ఒంటరిగానే ఆలయంలో ఉంటూ దేవుడికి పూజా కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా ఈ నెల 28వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో మనోజ్‌ తల్లికి ఫోన్‌ చేయగా  స్పందించలేదు. దీంతో మామిడిపల్లిలోని ఓ యువకుడికి ఫోన్‌లో చెప్పి అక్కడికి వెళ్లి చూసి రమ్మనగా.. శోభాశర్మ మృతి చెంది కనిపించింది.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో వెళ్లి  చూడగా.. శోభా శర్మ మెడకు ఉరి బిగించి కనిపించింది. ముఖంపై కూడా రక్తపు గాయాలున్నాయి. గదిలో ఉన్న అల్మారా తలుపులు పగులకొట్టారు. ఆమె ఒంటరిగా ఉంటుందని తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మనోజ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 38 రోజుల వ్యవధిలో నాలుగు హత్యోదాంతాలు చోటు చేసుకోవడం పట్ల స్థానిక ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే కొడుకు, కోడలు మృతి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం..

మరిన్ని వార్తలు