ప్రియురాలికి కుదిరిన పెళ్లి.. మమ్మీ.. డాడీ సారీ..!

4 Jul, 2021 14:14 IST|Sakshi
వినయ్‌(ఫైల్‌)

సాక్షి, దోమ(రంగారెడ్డి): కులాలు వేరైనా యువతి, యువకుడి మనసులు కలిశాయి. ఉద్యోగం సాధించిన తర్వాత ఏడడుగులు నడిచి జీవితాంతం కలిసి బతుకుదామని బాస చేసుకున్నారు. అంతలోనే అమ్మాయికి పెళ్లి కుదరడంతో ప్రియురాలు దక్కదేమోనని మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని కిష్టాపూర్‌ గ్రామంలో ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.

ఎస్సై రాజు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మంబాపురం ఆనందం, లలిత దంపతుల చిన్న కుమారుడు వినయ్‌(23) నల్లగొండ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్నాడు. లాక్‌డౌన్‌తో ఏడాదిగా ఇంటి దగ్గరే ఉంటున్నాడు. వినయ్, అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేర్వేరు. వినయ్‌ తాను ఉద్యోగం సాధించిన తర్వాత పెళ్లి చేసుకుందామని యువతికి చెప్పడంతో సరేనంది. అయితే అమ్మాయికి మరో వ్యక్తితో ఇటీవల పెళ్లి కుదిర్చారు.

అయితే ఈవిషయమై ఇద్దరూ ఫోన్‌లో చాట్‌ చేసుకున్నారు. కలిసి జీవించనప్పుడు ఎందుకు బతకడం.. చనిపోదామని నిర్ణయించుకున్నారు. గత నెల 29న పొలం దగ్గరకు వెళ్లిన వినయ్‌ పురుగుల మందు తాగాడు. కుటుంబీలకు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. వినయ్‌ ఆత్మహత్యకు గల కారణాలు కుటుంబీకులకు తెలియరాలేదు. అంత్యక్రియలు అనంతరం అతడి ఫోన్‌ను పరిశీలించగా వినయ్‌ ప్రేమ విషయం, ప్రేమికులు ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్న విషయాలు బయటపడ్డాయి.

అందులో మమ్మీ.. డాడీ క్షమించండి.. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నా.. అని ఉంది. దీంతో మృతుడి తండ్రి ఆనందం శుక్రవారం తన కుమారుని మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. శనివారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు. తమ కుమారుడి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినయ్‌ తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు