నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్‌ను నమ్మించి..

13 Jul, 2022 08:59 IST|Sakshi

మాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్‌ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్‌ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్‌ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది.

తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్‌కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్‌ వరుని కోసం మాట్రిమోని వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్‌ సియాన్‌ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు.

ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్‌ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్‌ఫోన్‌ నెంబర్లు మార్చుకుని ఫోన్‌లో తరచూ మాట్లాడుకునేవారు.
చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల 

లక్ష యూరోలతో వచ్చాడు.. 
ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్‌ చేయించాడు. ఆమె డాక్టర్‌తో మాట్లాడుతూ.. యుసాన్‌ సియాన్‌ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్‌ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది.

దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్‌ సియాన్‌ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్‌ వారు చెప్పిన అకౌంట్‌కు రూ.19,59,920లను డిపాజిట్‌ చేశారు. దీని తరువాత వారు ఫోన్‌లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు