దేవుడా ఎంతపని చేశావయ్యా.. పెళ్లై నెలైనా కాలేదు.. ఇంతలోనే..

28 Dec, 2021 08:25 IST|Sakshi

సాక్షి, లావేరు: కాళ్ల పారాణి ఆరలేదు. పెళ్లి సరదాలు తీరనే లేదు. ఇంతలోనే ఆ నవవధువు జీవితం తల్లకిందులైపోయింది. కలకాలం తోడుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసిన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె కన్నీరుమున్నీరైంది. ఈ విషాదకర సంఘటన లావేరు మండలంలోని మురపాక గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.  గ్రామంలోని పీబీనగర్‌ కాలనీలో గల వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన మురపాక గ్రామానికి చెందిన గొర్లె అప్పలనాయుడు(27) శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం వేకువ న మృతి చెందాడు. ఆయనకు భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మ, ఒక సోదరుడు ఉన్నారు. లావేరు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు.  
చదవండి: (ఆ పతంగి దారం అతని గొంతును కోసేసింది.. అదృష్టవశాత్తు భార్యకు..)

పెళ్లయిన 19 రోజులకు.. 
లావేరు మండలంలోని మెట్టవలసకు చెందిన అశ్వినితో అప్పలనాయుడుకు ఈ నెల 8న వివాహం జరిగింది. అప్పలనాయుడు కంచిలి మండలంలోని సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. శని, ఆదివారాలు సెల వు కావడంతో ఇంటికి వచ్చిన అప్పలనాయుడు సొంత పనిపై ఆదివారం రాత్రి ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలేం గ్రామానికి వెళ్లి తిరిగి మురపాక వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అనుకోని ఈ విషాదంతో భార్య అశ్విని, తల్లిదండ్రులు లక్ష్ము నాయుడు, సీతమ్మలు గుండెలవిసేలా రోదించారు. వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు తేనెల మంగయ్యనాయుడు, బాలి శ్రీనివాసనాయుడు, పెయ్యల లక్ష్మణరావు, తేనెల సురేష్‌కుమార్, లండ కిరణ్‌కుమార్, జల్లేపల్లి జనార్ధన్‌ తదితరులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.  

చదవండి: (భర్తతో గొడవల కారణంగా పుట్టింటికి.. మద్యం మత్తులో)

మరిన్ని వార్తలు