యువకుడు సజీవ సమాధి...పోలీస్‌ ఎంట్రీతో తప్పిన ప్రమాదం

27 Sep, 2022 16:53 IST|Sakshi

ఇంకా కొన్నిచోట్ల అమాయక భక్తుల నమ్మకాన్ని క్యాష్‌ చేసుకునేందుకు వారిచే అమానుష పనులు చేయిస్తున్నారు. మనల్ని మనం ఆత్మర్పణం చేసుకుంటే దేవుడు కనిపిస్తాడని, లేదా శరీరా భాగాలను దేవుడికి సమర్పిస్తే కనిపిస్తాడంటూ కొందరు స్వామీజీలు, బాబాలు తమ కల్లబొల్లి కబుర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్లెందరో ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు ఒక పూజారి మాయ మాటలు నమ్మి...ఒక పిచ్చిపని చేయబోయాడు. కానీ పోలీసులు సమయానికి రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకెళ్తే...ఉ‍త్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన ముగ్గురు పూజారులు మాయమాటలు నమ్మి ఒక యువకుడు దారుణమైన పనికి ఒడిగట్టాడు. ఈ ఘటన ఉన్నావ్‌లోని తాజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. తాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన శుభమ్‌ గోస్వామీ అనే యువడకుడు నవరాత్రుల సందర్భంగా ఆరడగుల గోతులో సమాధి అయ్యేందుకు సిద్ధమయ్యాడు.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సదరు యువకుడిని ఆ సమాధి నుంచి బయటకు తీసి కాపాడారు. ఆ యువకుడిని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో ఆ యువకుడు..తాను ఊరుకి దూరంగా గుడిసె వేసుకుని అక్కడే ఐదారేళ్లుగా ఉంటున్నట్లు చెప్పాడు.

శివకేశవ్‌ దీక్షిత్‌, మున్నాలాల్‌ అనే పూజారులతో గత కొంతకాలంగా పరిచయం ఏర్పడినట్లు తెలిపాడు. సజీవ సమాధి అయితే జ్ఞానోదయం అవుతుందని, ఈ పనిని దేవీనవరాత్రులు ప్రారంభానికి ముందుగా చేస్తేనే సఫలం అవుతుందని చెప్పినట్లు వెల్లడించాడు. అందుకు తాను తన తండ్రి వినీత్‌ గోస్వామీ మరొకందరు సాయంతో భూమి లోపల ఆరుడుగుల గోతిలో సజీవ సమాధి అయ్యేందుకు సిద్ధమైనట్లు వివరించాడు.

ఐతే గ్రామంలో ఒక యువకుడు సజీవ సమాధి అయ్యాడంటూ వార్తలు గుప్పుమన్నాయని, దీంతో తాము చాలా భయందోళనలకు గురయ్యామని పోలీసులు తెలిపారు. నిందితులు మున్నాలాల్‌, శివ కేశవ్‌ దీక్షిత్‌ అనే ముగ్గురు పూజారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఆ నిందితులు బాధితుడి నమ్మకాన్ని సోమ్ము చేసుకోవాలనే దురుద్దేశంతో ఇలా భూసమాధి కావాలనే కుట్రను పన్నినట్లు పేర్కొన్నారు.

(చదవండి: అది రిసార్టు కాదు ..వ్యభిచార కూపం)
 

మరిన్ని వార్తలు