ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌కు ఘన స్వాగతం

30 Mar, 2023 02:22 IST|Sakshi

అమలాపురం టౌన్‌: ఎమ్మెల్యే కోటా ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికై సొంత గడ్డ కోనసీమకు తొలిసారి వచ్చిన బొమ్మి ఇజ్రాయిల్‌కు బుధవారం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు, ఎమ్మార్పీఎస్‌ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయనను కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి అల్లవరం వరకూ దాదాపు 45 కిలోమీటర్ల మేర భారీ ఊరేగింపుతో తోడ్కొని వచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ ఆశీనులయ్యారు. వారు మాట్లాడుతూ మాదిగలను చట్ట సభ ప్రజాప్రతినిధులను చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు రాష్ట్ర మాదిగలంతా రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. రావులపాలెంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. కొత్తపేట, పలివెల, ముక్కామల, పుల్లేటికుర్రు, అంబాజీపేట, బండార్లంక, అమలాపురం పట్టణం, వై.జంక్షన్‌, అల్లవరం మీదుగా ఇజ్రాయిల్‌ సొంతూరు గోడి గ్రామానికి ఊరేగింపు రాత్రి 10 గంటలకు చేరుకుంది. ప్రతీ గ్రామంలో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌కు ముఖ్యంగా మాదిగ మహిళలు నుదుట తిలకం దిద్ది హారతులు పట్టారు. పూలమాలలు వేసి సత్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జిల్లా చరిత్రలో తొలిసారి మాదిగ నేత ఇజ్రాయిల్‌ను ఎమ్మెల్సీని చేసి చట్టసభకు పంపిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఊరేగింపులో అడుగడుగునా ఎమ్మార్పీఎస్‌ నాయకులు, కార్యకర్తలు జైజైలు పలికి కృతజ్ఞతలు తెలిపారు. తీన్‌మార్‌ డప్పులతో, బాణసంచా కాల్పులతో ఇజ్రాయిల్‌ ఊరేగింపు వాహనానికి ఎదురేగి మాదిగలు స్వాగతం పలికారు. జిల్లాలోని మాదిగ పేటల నుంచి ఆ సామాజిక వర్గీయులు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయిల్‌ రాకను ఓ పండగలా స్వాగతించారు. పుల్లేటికుర్రులో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఇజ్రాయిల్‌ ఊరేగింపు వాహనంపై ఆశీనులై అంబాజీపేట వరకూ కొనసాగారు. అమలాపురం పట్టణ ముఖద్వారం ఈదరపల్లి వంతెన, గడియారం స్తంభం సెంటర్‌, హైస్కూలు సెంటర్‌ వై.జంక్షన్‌లో ఇజ్రాయిల్‌కు పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించి స్వాగతించారు. హైస్కూలు సెంటరులో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్వాగతం పలికారు. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం పట్టణ పార్టీ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, రాష్ట్ర మంత్రి విశ్వరూప్‌ తనయుడు డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, పార్టీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి సరెళ్ల రామకృష్ణ స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు