పల్లెల్లో క్రీడా సంక్రాంతులు | Sakshi
Sakshi News home page

పల్లెల్లో క్రీడా సంక్రాంతులు

Published Fri, Nov 24 2023 11:40 PM

- - Sakshi

గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం

‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం

డిసెంబర్‌ 15న ప్రారంభానికి కసరత్తు

ఈనెల 27 నుంచి

ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు

సచివాలయాల పరిధిలో పోటీల నిర్వహణ

సచివాలయం పరిధిలో 20 జట్లు ఎంపిక

15 ఏళ్ల వయసు దాటిన

బాల, బాలికలకు అవకాశం

సాక్షి, రాజమహేంద్రవరం: గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం, పోటీ తత్వాన్ని పెంపొందించే దిశగా ప్రణాళికలు రూపొందించింది. క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతికి నెల రోజుల ముందే ఈ పోటీలు డిసెంబర్‌ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. వీటిని ప్రతి సచివాలయ పరిధిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

512 సచివాలయాల్లో నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా 512 సచివాలయాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. క్రికెట్‌, వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో పోటీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్టు, క్రీడాకారులు అనంతరం మండల స్థాయిలో పోటీల్లో పాల్గొంటారు. అనంతరం జిల్లా స్థాయి, అ అక్కడ సత్తా చాటితే రాష్ట్ర స్థాయికి వెళతారు.

పోటీలు జరుగుతాయిలా..

క్రీడా పోటీలు ప్రతి సచివా లయం పరిధిలో నిర్వహిస్తా రు. అందుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించారు. వాలీబాల్‌, బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, ఖోఖో, కబడ్డీ క్రీడా పోటీల్లో ఒక్కో క్రీడకు ఇద్దరు పురుషులు, రెండు మహిళా జట్లు పాల్గొంటాయి. సచివాలయం పరిధిలో పోటీలు నిర్వహించాలంటే 228 క్రీడాకారులు ఉండాలి. అందుకు అనుగుణంగా క్రీడాకారుల ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ప్రతి సచివాలయం పరిధిలో 20 జట్లు పాల్గొంటాయి. సచివాలయ పరిధిలో 5 రోజులు, మండల స్థాయిలో 12 రోజులు, నియోజకవర్గ స్థాయిలో 5 రోజుల పాటు పోటీలు జరుగుతాయి. ఏడు రోజుల పాటు జిల్లా, 5 రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి.

27 నుంచి రిజిస్ట్రేషన్లు

క్రీడాకారులకు ఈనెల 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. వలంటీర్లు శనివారం నుంచి ప్రతి ఇంటికీ తిరిగి ఆడుదాం ఆంధ్రాపై అవగాహన కల్పిస్తారు. ఆసక్తి ఉన్న క్రీడాకారుల నుంచి వివరాలు సేకరిస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ చేస్తారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

పారదర్శకంగా పోటీలు

గ్రామ సచివాలయ స్థాయిలో నిర్వహించే పోటీలు పక్కాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక కమిటీని నియమించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, స్పెషల్‌ నోడల్‌ అధికారి జాయింట్‌ కలెక్టర్‌ ఉంటారు. గ్రామ స్థాయిలో గ్రేడ్‌–5 సెక్రటరీ, వీఆర్వో, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, డిజిటల్‌ అసిస్టెంట్‌, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌, మహిళా పోలీసు, పాఠశాల హెచ్‌ఎం కమిటీలో ఉంటారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, పంచాయతీ విస్తరణాధికారి, ఏపీఓ, ఉపాధి హామీ, ఏపీఎం, వైఎస్సార్‌ క్రాంతి పథం, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ, వ్యవసాయ శాఖ, ఏఓ, ఇంజినీరింగ్‌ ఏఈ, సభ్యులుగా ఉంటారు.

క్రీడా వికాసానికి దోహదం

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఆడు దాం ఆంధ్ర పేరుతో ప్రభుత్వం క్రీడా పోటీలు నిర్వహిస్తోంది. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో 15 ఏళ్లు పైబడిన వారు పోటీలకు అర్హులుగా నిర్ణయించింది. క్రీడలపై యువతీ, యువకులకు అవగాహన కల్పిస్తున్నాం. పోటీలు ఐదు వేర్వేరు దశల్లో జరుగుతాయి. క్రీడల్లో పాల్గొనాలనుకున్న వారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ప్రక్రియ 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యువత సద్వినియోగం చేసుకుని క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. కె.మాధవీలత, కలెక్టర్‌

ప్రణాళికాబద్ధంగా నిర్వహణ

క్రీడా పోటీలు ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తాం. అందుకుగాను కలెక్టర్‌ కె,మాధవీలత నేతృత్వంలో ప్రత్యేక కమిటీ పనిచేస్తుంది. స్పోర్ట్స్‌ మెటీరియల్‌, ప్రైజ్‌ మనీ, సర్టిఫికెట్లు, ట్రోఫీలు, గ్రౌండ్‌ ప్రిపరేషన్‌, మెడికల్‌ కిట్లు, పి.ఇ.టి. గౌరవ వేతనం, క్రీడాకారుల టీఏ,డీఏ, రవాణా, వసతి, భోజనం, లైటింగ్‌, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ఏర్పాటు చేస్తాం. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోటీలు నిర్వహిస్తాం.

డీఎంఎం. శేషగిరి,

జిల్లా ముఖ్య క్రీడా శిక్షకుడు

15 ఏళ్లు పైబడిన వారు అర్హులు

క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు 15 ఏళ్ల వయసు దాటిన బాల బాలికలకు అవకాశం కల్పించారు. వీరితో పాటు మహిళలు, పురుషులు సైతం పోటీల్లో పాల్గొనే వెసులుబాటు కల్పించారు. ఇందుకు ఈనెల 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. గ్రామ, వార్డు సచివాలయాలకు క్రీడలకు అవసరమైన సామగ్రి పంపిణీ చేయనున్నారు. సచివాలయ స్థాయిలో బేసిక్‌, నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌ క్రీడా సామగ్రి అందజేయనున్నారు. మండల స్థాయికి ఎంపికై న క్రీడాకారులకు టీషర్ట్‌, క్యాప్‌, రిస్ట్‌ బ్యాండ్‌, జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీ, మెడల్‌ అందిజేస్తారు. క్రీడల నిర్వహణకు సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయుల సేవలు వినియోగించుకుంటారు.

పోటీల షెడ్యూల్‌

గ్రామ స్థాయి : డిసెంబర్‌ 15–20వ తేదీ

మండల స్థాయి : డిసెంబర్‌ 21–జనవరి 4

నియోజకవర్గ స్థాయి : జనవరి 5–10

జిల్లా స్థాయి : జనవరి 11–21

రాష్ట్ర స్థాయి : జనవరి 22–26

1/3

2/3

3/3

Advertisement
Advertisement