కన్ను పడితే.. అన్నీ మాయమే..

24 Dec, 2023 02:26 IST|Sakshi

కడియం: ట్రాక్టర్లు, ఇనుప చక్రాలు, ధాన్యం బస్తాలు.. ఇలా కాదేదీ దొంగతనానికి అనర్హం అన్న రీతిలో చెలరేగిపోయిన నలుగురు దొంగల ముఠా సభ్యులను కడియం పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ పీవీజీ తిలక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అరెస్టు చేశారు. వారి నుంచి పలు వస్తువులను రికవరీ చేశారు. ఈ మేరకు కడియం పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ తిలక్‌ వివరాలు వెల్లడించారు. కుతుకులూరు గ్రామానికి చెందిన పోతంశెట్టి విజయరెడ్డి, పోతంశెట్టి సూర్యభాస్కర్‌రెడ్డి, పోతంశెట్టి సాయిరామరెడ్డి, పాసి శేఖర్‌ ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరు రైసుమిల్లు, ధాన్యం కోత యంత్రాలు వంటివి నిర్వహించగా నష్టపోయారు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు చోరీల బాట పట్టారు. అందులో భాగంగా కడియం మండలం మురమండలోని జమ్మిచెట్టు పుంతలో గన్ని రామారావుకు చెందిన ట్రాక్టర్‌ను చోరీ చేశారు. దీనిపై అతను కడియం పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు ప్రారంభించారు. మురమండ గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముఠా సభ్యులను శనివారం అదుపులోకి తీసుకుని విచారించగా, ట్రాక్టర్‌తో సహా ఇతర చోరీల విషయం బయటపడింది.

అనేక దొంగతనాలు

ఈ ముఠా సొంత గ్రామమైన కుతుకులూరులో కాలువ గట్టుపై ఒక ట్రాక్టర్‌ను మాయం చేశారు. పెనుమర్రు మండలం జుట్టుగ గ్రామంలో మరో ట్రాక్టర్‌ను చోరీ చేసి, రాయవరానికి చెందిన ఇద్దరు తుక్కు వ్యాపారులకు రూ.86 వేలకు విక్రయించారు. లొల్ల, కేశవరం, చినద్వారపూడి గ్రామాల్లో పొలాల్లో ఉంచిన 50 ధాన్యం బస్తాలను కూడా మాయం చేశారు. అనపర్తి మండలం ఆర్తమూరులో రోడ్డు పక్కన ఉన్న మూడు ఐరన్‌ ట్రాక్టర్‌ వీల్స్‌ దొంగతనం చేశారు. వీటిలో రెండు ట్రాక్టర్లు ఐరన్‌వీల్స్‌, రెండు మోటారు సైకిళ్లను రికవరీ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ పీవీజీ తిలక్‌ తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. కాగా ఉన్నతాధికారుల సూచనలతో దర్యాప్తులో చురుగ్గా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ తిలక్‌, ఎస్‌ఐ మహ్మద్‌ హసక్‌, సిబ్బంది కె.సురేష్‌ కుమార్‌, జి.రవికుమార్‌, కుమార్‌ను ఎస్పీ అభినందించారు.

ట్రాక్టర్ల నుంచి ధాన్యం బస్తాల వరకూ చోరీ

ముఠాను పట్టుకున్న కడియం పోలీసులు

>
మరిన్ని వార్తలు