ఉపాధిలో మెరిసి.. పురస్కారం గెలిచి..

5 Mar, 2023 01:06 IST|Sakshi
బుట్టాయగూడెం గ్రామ సచివాలయం

బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీలోని బుట్టాయగూడెం గ్రామ సచివాలయానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. జలశక్తి అభియాన్‌లో ఆదర్శవంతమైన పనితీరుకు గుర్తింపు దక్కింది. గత మూడేళ్లలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సేకరణ, సంరక్షణ పనులకు గాను పురస్కారం వరించింది. ఈ మేరకు గ్రామ సర్పంచ్‌ తెల్లం వెంకాయమ్మ శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన స్వచ్ఛ జలశక్తి సమ్మాన్‌–2023 ఉమెన్స్‌ లీడర్‌షిప్‌ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పురస్కారం అందజేశారని డ్వామా పీడీ దుండి రాంబాబు తెలిపారు.

ఏఏ పనులంటే.. ఉపాధి హామీ పథకంలో చెరువు పూడిక తీత పనులు, పంట కాలువలు, పొలాలు, మొక్కల చుట్టూ కందకాలు తదితర పనులను పరిగణనలోకి తీసుకుని పురస్కారానికి ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షం నీటిని ఒడిసిపట్టి వాటిని వినియోగించడమే లక్ష్యమని.. ఈ విధానంలో బుట్టాయగూడెం సచివాలయం పరిధిలో జరిగిన పనులు ఆదర్శంగా నిలిచాయని అంటున్నారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో నీటిపారుదల పునరుద్ధరణ పనులతో సుమారు 10 లక్షల క్యూసెక్కు మీటర్ల నీటి సామర్థ్యాన్ని సృష్టించారు. అలాగే రూ.1.30 కోట్ల వాటర్‌ షెడ్ల అభివృద్ధి పనులు, 4 తాగునీటి ట్యాంక్‌ల డీసిల్డింగ్‌ పనులు, 4 ఓవర్‌ హెడ్‌ వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంక్లు, 6 పశువుల చెరువుల పనులు, 2 చెక్‌డ్యామ్‌లు తదితర పనులు జరిగాయి.

గతంలోనూ అవార్డులు

బుట్టాయగూడెం సచివాలయం 2019–20లో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కిరణ్‌ పురస్కారాన్ని దక్కించుకుంది. అలాగే పంచాయతీ పలు పురస్కారాలను అందుకుంది.

కలెక్టర్‌ అభినందనలు

స్వచ్ఛభారత్‌, జలజీవన్‌ మిషన్‌, జలశక్తి అభియాన్‌ రంగాల్లో కృషి చేసిన వారిలో దేశవ్యాప్తంగా 36 మందికి పురస్కారాలు లభించగా రాష్ట్రం నుంచి బుట్టాయగూడెం సచివాలయానికి అవార్డు రావడం అభినందనీయమని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. అవార్డు అందుకున్న సర్పంచ్‌ వెంకాయమ్మతోపాటు డ్వామా పీడీ దుండి రాంబాబు, ఏపీడీ ప్రపుల్‌ కుమార్‌, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కు కలెక్టర్‌తో పాటు జేసీ అరుణ్‌బాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

బుట్టాయగూడెం సచివాలయానికి జాతీయ స్థాయి అవార్డు

ఉపాధి హామీలో నీటి సేకరణ, సంరక్షణ పనులకు గుర్తింపు

కేంద్రమంత్రి చేతులమీదుగా అవార్డు అందుకున్న సర్పంచ్‌

సమష్టి కృషితోనే..

జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నీటి సేకరణ, సంరక్షణ పనులకు వచ్చిన అవార్డుతో మరింత బాధ్యత పెరిగింది. ప్రజల సహకారంతో మరిన్ని అవార్డులు పొందవచ్చు. ప్రజలు, అధికారుల సమష్టి కృషితోనే జాతీయ స్థాయి పురస్కారం సాధించాం.

– దుండి రాంబాబు, డ్వామా పీడీ, ఏలూరు

మరిన్ని వార్తలు