ఆరోగ్య రక్ష.. | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 1:08 AM

వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ నమూనా - Sakshi

ఊరూర..
వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆరోగ్య రక్షణ విషయంలో మరో అడుగు ముందుకేశారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రజలు అనారోగ్యం పాలు కాకూడదన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం పంచాయతీ స్థాయిలోనే ఆరోగ్య పరిరక్షణకు టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించి జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు.

పంచాయతీ కార్యదర్శులను అప్రమత్తం చేశాం

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకున్న గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణ విషయంలో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులను కూడా అప్రమత్తం చేశాం. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని కూడా ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. సంపూర్ణ ఆరోగ్యం దిశగా గ్రామీణ ప్రాంతాలను తీర్చిదిద్దుతాం. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు గ్రామ కమిటీలకు సహకరిస్తాం.

– జీవీ నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి

ప్రజలకు ఎంతో ఉపయోగం

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆరోగ్యంతో పాటు వెల్‌నెస్‌ కార్యక్రమం ద్వారా హార్ట్‌ ఎటాక్‌, క్యాన్సర్‌, హైపర్‌ టెన్షన్‌, తదితర అంశాలకు సంబంధించి ప్రజలకు క్రమంగా అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలకు ఆరోగ్యం, అనారోగ్యంపై అవగాహన కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు, ఫ్యామిలీ ఫిజీషియన్‌ వంటి కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నాం.

– రాజ్యలక్ష్మి, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పంచాయతీ స్థాయిలో ప్రతిఒక్కరి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 28న జీవో ఎంఎస్‌ నంబర్‌–34ను విడుదల చేసింది. జిల్లాలోని 729 గ్రామ పంచాయతీల్లో ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్‌డీజీ) సాధన కోసం టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు ఏర్పాటు చేసే దిశగా జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత సేవలు అందించేందుకు ఈ సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు.

ఆరుగురు సభ్యులతో కమిటీ...

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఆరోగ్య రంగంలో సుస్థిర అభివృద్ధి (ఎస్‌డీజీ) సాధన కోసం ఆరుగురు సభ్యులతో కూడిన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు కానుంది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం అధికారులు కమిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి అర్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌వో–మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌–ఎంఎల్‌హెచ్‌వో)ను టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి లీడర్‌గా వ్యవహరించేలా రూపకల్పన చేయనున్నారు. ఆ కమిటీలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, అంగన్‌వాడీ టీచర్‌, స్కూలు హెల్త్‌ అంబాసిడర్‌, గ్రామంలోని డ్వాక్రా గ్రూపు అధ్యక్షురాలు కూడా ఉంటారు.

విధులు ఇలా...

● రక్తహీనత పర్యవేక్షణ, ప్రసూతి మహిళల ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం, జీవనశైలి, జబ్బుల నిర్ధారణ..వాటి నివారణ, చికిత్స తదితర ఆరోగ్య కార్యకలాపాలపై ఏఎన్‌ఎం, అంగన్‌వాడీ టీచర్‌, ఆశా వర్కర్‌, స్కూల్‌ హెల్త్‌ అంబాసిడర్‌, డ్వాక్రా గ్రూపు అధ్యక్షురాలు, సభ్యులు కమిటీ లీడర్‌కు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ఉంటారు.

● పాఠశాలల్లోని పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలపై పాఠశాలలోని హెల్త్‌ అంబాసిడర్‌ కూడా ఎప్పటికప్పుడు కమిటీ లీడర్‌కు సమాచారం అందించాలి. కౌమార దశలోని బాలికలు, బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో ఉన్న రక్తహీనతను పర్యవేక్షించడంతో పాటు డాక్ట్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లతో సమన్వయం చేసుకోవాలి. రక్తహీనత కలిగిన కౌమార దశలోని బాలికలకు ప్రతిరోజూ ఐఎఫ్‌ఏ మాత్రలు పంపిణీ చేయాలి. ఇతర పిల్లలకు పోషకాహారం అందించాలి.

● యుక్త వయసులోని బాలికలకు శానిటరీ నాప్కిన్స్‌ సరఫరా వివరాలు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు మధ్యాహ్న భోజనాల వివరాలను కమిటీ లీడర్లకు అందించాలి. ఫ్యామిలీ ఫిజీషియన్‌ ద్వారా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి.

● అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు గ్రామాల్లో రక్తహీనతపై పర్యవేక్షణ, గర్భిణులకు ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత సంరక్షణ, నులిపురుగుల నిర్మూలన మందుల పంపిణీ, పిల్లల ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించడం వంటి సేవలు సక్రమంగా అందేలా చూస్తూ టీం టీడర్‌తో సమస్వయం చేసుకోవాలి.

● గ్రామాల్లో జరిగే డ్వాక్రా గ్రూపు సమావేశాలకు టీమ్‌ లీడర్‌ విధిగా హాజరయ్యేలా టీంలో ఉన్న డ్వాక్రా గ్రూపు అధ్యక్షురాలు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. గ్రూపు సభ్యులు వారి నివాస ప్రాంతాల్లో ఏమైనా ఆరోగ్య సమస్యలున్నాయా? అని ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకోవాలి. గ్రూపు సభ్యులకు ఆయా ప్రాంతాల్లో జీవనశైలిని బట్టి జబ్బుల నివారణ, పరీక్షలు, చికిత్సలు లాంటి ఇతర అనారోగ్యకరమైన సమస్యలపై అవగాహన కల్పించాలి. గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి.

● ప్రసవానికి ముందు యాంటినేటల్‌ పరీక్షల సమయంలో యూఎస్‌జీ స్కానింగ్‌ ప్రాముఖ్యత, ఇమ్యునైజేషన్‌ ద్వారా రోగ నిరోధకతను పెంచడం ద్వారా వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలి.

● బాల్య వివాహాల నివారణ ద్వారా యుక్త వయస్సు గర్భాలను నిరోధించాలి.

● కుటుంబ నియంత్రణ ప్రణాళిక అమలు చేయాలి. ప్రతి శుక్రవారం డ్రై డే పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సిబ్బంది సమన్వయంతో సేవలందించేలా చూడాల్సిన బాధ్యత పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌పై ఉంటుంది.

ప్రధాన ఆరోగ్య సమస్యలపై దృష్టి...

గ్రామం ఒక యూనిట్‌గా ఏర్పాటు కానున్న ఈ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రధానంగా ప్రజల ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించాలి. ప్రతిరోజూ గ్రామంతో పాటు గ్రామ శివారునున్న పల్లెలు, తండాలు, గిరిజన గ్రామాల్లో అనారోగ్యకరమైన సమస్యలేమైనా తలెత్తాయా అని వాకబు చేస్తూ ఉండాలి. ప్రధానంగా గర్భిణులు, శిశువులు, మహిళలు, వృద్ధులు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం లాంటి వాటిని గమనించాలి. అనారోగ్యాలకు సంబంధించి నివారణ చర్యలు, గ్రామాల్లో జీవనశైలి, జబ్బుల నివారణ, చికిత్సలపై ఈ టాస్క్‌ఫోర్స్‌ అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement