బాస్కెట్‌బాల్‌లో మెరికలు | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 5 2023 1:06 AM

- - Sakshi

ఏలూరు రూరల్‌: ఏలూరులో కస్తూరిబా బాలికల పాఠశాల విద్యార్థినులు బాస్కెట్‌బాల్‌ క్రీడలో రాణిస్తున్నారు. స్కూల్‌, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో వరుస విజయాలు సాధిస్తూ భళా అనిపిస్తున్నారు. పాఠశాల పీడీ కె.మురళీకృష్ణ శిక్షణలో ఆటలో మెరికల్లా మారారు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్ధ ఏటా పాఠశాలలో వేసవి ప్రత్యేక శిబిరం నిర్వహిస్తోంది. అలాగే ఇక్కడ విద్యార్థినుల ప్రతిభను గుర్తించి రూ.70 వేల నగదు ప్రోత్సాహకం కూడా అందించారు. దాతలు దుస్తులు, బూట్లు అందించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారు.

2018లో కోర్టు ఏర్పాటు : పూర్వ విద్యార్థుల ఆర్థిక సాయంతో పీడీ మురళీకృష్ణ 2018లో పాఠశాలలో బాస్కెట్‌బాల్‌ కోర్టును నిర్మించారు. తర్వాత నగరపాలక సంస్థ అధికారులు కోర్టుకు ఫ్లోరింగ్‌ చేయించారు. ఇక్కడ రోజూ ప్రత్యేక శిక్షణతో పాటు వేసవిలో శిబిరాలు నిర్వహించడంతో పిల్లల్లో బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి పెరిగింది. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు గ్రిక్స్‌, స్కూల్‌గేమ్స్‌, అసోసియేషన్‌ నిర్వహించే జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీల్లో సత్తాచాటుతున్నారు.

పతకాల పరంపర

● గతనెలలో నూజివీడులో జరిగిన అండర్‌–14 ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో సత్తాచాటి ఎ.రుత్విక, జి.పూజిత, నందిని రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించారు.

● గత నెలలో విజయవాడలో జరిగిన అండర్‌–17 అంతర్‌ జిల్లాల పోటీల్లో పి.జయశ్రీ, ఆర్‌.రేణుక రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు.

● పాఠశాల విద్యార్థినులతో పాటు పూర్వ విద్యార్థినులతో కూడిన జట్టు 2020లో నూజివీడులో జరిగిన బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది.

● 2018లో రాష్ట్రస్థాయి పోటీల్లో చాంపియన్లుగా నిలిచిన జిల్లా జట్టులో 8 మంది కస్తూరిబా విద్యార్థినులు ఉండటం విశేషం.

● అలాగే మురళీకృష్ణ వద్ద శిక్షణ పొందిన వి.చంద్రలేఖ, బి.లీలావతి, బి.భవానిదేవి, ఎల్‌.లీలాసరోజనితో పాటు పలువురు బాలికలు జాతీయస్థాయి పోటీల్లో తలపడ్డారు.

ఏలూరు కస్తూరిబా పాఠశాలలో సాధన చేస్తున్న బాలికలు

పతకాలు సాధించిన విద్యార్థులతో ఉపాధ్యాయులు

రాణిస్తున్న ‘కస్తూరిబా’ బాలికలు

జాతీయస్థాయిలో ప్రతిభ

రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ద్వారా నజరానా

1/1

Advertisement
Advertisement