Recycling Of God Idols: అపశకునం కాదు, దేవుడి విగ్రహాలతో రీసైక్లింగ్‌

19 Oct, 2023 10:33 IST|Sakshi

ఆలయంలో అయినా, ఇంట్లో అయినా పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తాం. ఇంట్లో ఉండే దేవతామూర్తుల విగ్రహాలు, పటాలు, ఫొటో ఫ్రేములు జారిపడినా, పక్కకు ఒరిగిపోయినా అపశకునంగా భావిస్తారు. అందుకే మరింత శ్రద్ధగా పూజ చేయడంతో పాటు, పూజాసామగ్రిని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తుంటారు.

అయినప్పటికీ కొన్నిసార్లు విగ్రహాలు పాతబడి విరిగిపోవడం, ఫొటో ఫ్రేములు చిరిగిపోవడం లేదా తుప్పు పట్టి పాడైపోవడం జరుగుతుంటుంది. అలాంటి వాటిని వెంటనే తీసేసి  కొత్తవాటిని పూజలో పెట్టుకుంటారు. మనలో చాలామంది ఇలానే పడేస్తుంటాము. తృప్తిౖ గెక్వాడ్‌ మాత్రం ఈ విగ్రహాలను పడేయకుండా.. రీ సైకిల్‌ చేసి రకరకాల వస్తువులను తయారు చేస్తోంది. చెత్తగా మారకుండా... సరికొత్త హంగులు అద్ది అందంగా మారుస్తోంది.

మహారాష్ట్రలోని యోవలాలో పుట్టిపెరిగిన తృప్తి గైక్వాడ్‌ వృత్తిపరంగా నాసిక్‌లో స్థిరపడింది. న్యాయవాదిగా క్షణం తీరికలేని పని తనది. అయితే తన చుట్టూ ఉన్న సమాజంలో జరిగే విషయాలను ఎంతో ఆసక్తిగా గమనించే మనస్తత్వం కావడం వల్ల 2019లో ఓసారామె గంగానదిని చూడడానికి వెళ్లింది. అప్పుడు గంగానదిని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇదే సమయంలో ... విరిగిపోయిన దేవతామూర్తుల విగ్రహాలు, ఫ్రేములు తీసుకుని నదిలో వేయడానికి వచ్చాడు ఒకతను. అతన్ని చూసిన తృప్తి..‘‘వీటిని నదిలో వేయకు.

వీటిలో ఉన్న పేపర్, కార్డ్‌బోర్డ్, మట్టిబొమ్మలు నదిని మరింత కలుషితం చేస్తాయి’’ అని చెప్పి అతను వాటిని నదిలో వేయకుండా వారించింది. అందుకు ఆ వ్యక్తి ఇక్కడ వేయవద్దు.. సరే వీటిని ఏం చేయాలి?’’ అంటూ చికాకు పడ్డాడు. అప్పటికేదో సమాధానం చెప్పి అతణ్ణి పంపింది కానీ  తృప్తి మనసులో కూడా ‘అవును వీటిని ఏం చేయాలి?’ అన్న ఆలోచన మొదలైంది. కొద్దిరోజులు తర్వాత వీటిని రీ సైకిలింగ్‌ చేసి ఇతర వస్తువులు తయారు చేయవచ్చన్న ఆలోచన తట్టింది తనకు. తన ఐడియాను కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగుతో పంచుకుంది. అంతా ప్రోత్సహించేసరికి .. పాత దేవతామూర్తుల విగ్రహాలు రీసైకిల్‌ చేయడం ప్రారంభించింది.  

సంపూర్తిగా...
విగ్రహాలను రీసైక్లింగ్‌ చేసేందుకు‘సంపూర్ణమ్‌’ పేరిట స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. సంపూర్ణమ్‌ టీమ్‌ దేవతామూర్తుల పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేములను గుళ్లు, చెట్లకింద పడి ఉన్న వాటిని, ఇళ్లనుంచి సేకరిస్తుంది. ఈ విగ్రహాలను పూర్తిగా పొడిచేసి మొక్కలకు ఎరువులా మారుస్తారు. ఎరువుగా పనికిరాని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కలిసిన మట్టిని కుండలు, పాత్రలు, ఇటుక రాళ్లుగా తయారు చేస్తారు.

వీటితో పక్షులు, జంతువులకు గూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా తయారైన పాత్రల్లో పక్షులు, జంతువులకు ఆహారం, తాగునీటిని అందిస్తున్నారు. సంపూర్ణమ్‌ సేవలను మహారాష్ట్రలోని పూనే, నాసిక్, ముంబై, సోలాపూర్, సంగమ్నేర్‌లకు విస్తరించింది తృప్తి. ఇటీవల ఇతర రాష్ట్రాల్లో సైతం సేవలను ప్రారంభించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా ఈ రీసైక్లింగ్‌ గురించి అవగాహన కల్పిస్తోంది.

ఆకర్షణీయమైన టాయిస్‌..
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ కలిసిన విగ్రహాలను పొడిగా మార్చి, ఈ పొడికి కొద్దిగా సిమెంట్‌ను కలిపి టాయిస్‌ను రూపొందిస్తున్నారు. మురికి వాడల్లోని నిరుపేద పిల్లల ద్వారా పాతవిగ్రహాలు, ఫొటోఫ్రేమ్‌లనూ సేకరిస్తూ వారికి ఆర్థికంగా సాయపడుతోంది.          

‘‘దేవతల విగ్రహాల ఫొటోఫ్రేములను చక్కగా అలంకరించి నిష్ఠగా పూజిస్తారు. ఇటువంటి ఫ్రేములు పాడైతే పడేయాల్సిందే. ఇది నచ్చకే సంపూర్ణమ్‌ను తీసుకొచ్చాను. దేవుడి విగ్రహాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసిన తరువాతే రీసైక్లింగ్‌ చేస్తున్నాను. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో చాలామంది కస్టమర్లు నన్ను సంప్రదిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటిదాకా వేల సంఖ్యలో రీసైక్లింగ్‌ చేసి పర్యావరణాన్ని కాపాడాను. అదేవిధంగా దేవుడి పటాలకు మంచి రూపాన్ని ఇవ్వడం ఎంతో తృప్తినిస్తోంది’’.
– తృప్తి గైక్వాడ్‌

మరిన్ని వార్తలు