Appendix Cancer: అపెండిక్స్‌కు క్యాన్సర్‌ వస్తుందా!

8 Nov, 2021 13:30 IST|Sakshi

మన చిన్న పేగులూ, పెద్దపేగు కలిసే జంక్షన్‌లో అపెండిక్స్‌ అనే చిన్న తోక లాంటిది ఉంటుంది. అన్ని అవయవాల మాదిరిగానే దీనికీ క్యాన్సర్‌ సోకుతుంది. అయితే ఇది చాలా అరుదు. ఇలాంటి క్యాన్సర్‌ వచ్చినవారితో పాటు మరికొన్ని గడ్డల వల్ల పొట్టకుహరంలో మ్యూసిన్‌ అనే స్రావాలు స్రవిస్తాయి. ఈ కండిషన్‌ను ‘సూడోమిక్సోమా పెరిటోనీ’ అంటారు. అన్ని క్యాన్సర్‌లలాగే ఇది కూడా కడుపు లేదా దాని పరిసరాల్లో ఉండే ఇతర ప్రాంతాలకూ, అవయవాలకూ విస్తరిస్తుంది. 

సీటీ స్కాన్‌ వంటి పరీక్షలతో దీన్ని గుర్తించవచ్చు. దీని లక్షణాలు అంత త్వరగా బయటపడవు. దాంతో వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యమవుతుంది. దాంతో అపెండిక్స్‌ క్యాన్సర్‌ రోగుల్లో చాలామంది మృతువు బారిన పడుతుంటారు.  త్వరగా గుర్తిస్తే అన్ని క్యాన్సర్‌లలాగే దీనికీ చికిత్స చేయవచ్చు. చికిత్స ఒకింత కష్టమే అయినప్పటికీ... ప్రస్తుతం దీనికి ‘హైపెక్‌’ అనే అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉంది. హైపర్‌ థర్మిక్‌ ఇంట్రాపెరిటోనియల్‌ కీమోథెరపీ అనే ప్రక్రియకు సంక్షిప్తరూపమే ఈ ‘హైపెక్‌’. ఇందులో ఉదరభాగంలోని పెరిటోనియమ్‌ (ఒక పొరలాంటి తొడుగు)ను మొత్తం తొలగించి, ఓ నిర్దిష్టమైన ఉష్ణోగ్రత (42 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్‌) వద్ద కీమోథెరపీ మందునంతా ఆ భాగంలో సమంగా విస్తరించేలా చేస్తారు. ఇలా 60 నుంచి 90 నిమిషాల పాటు చేయడం ద్వారా ఈ సూడో మిక్సోమా పెరిటోనీ తిరగబెట్టడాన్ని చాలాకాలం పాటు వాయిదా వేయవచ్చు. 

చదవండి: 1.5 లీటర్ల కోల్డ్‌ డ్రింక్‌ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..

మరిన్ని వార్తలు