ఫిమేల్‌ ఆర్‌జే: అహో... అంబాలా జైలు రేడియో!

24 Dec, 2021 00:20 IST|Sakshi
కాబోయే ‘ఆరేజే’లకు శిక్షణ ఇస్తున్న వర్తికా నందా; అంబాలా జైలు రేడియో

అక్కడ ఒక ట్రైనింగ్‌ సెషన్‌ జరుగుతోంది. ‘మీ ముందు మైక్‌ ఉన్నట్లు పొరపొటున కూడా అనుకోకూడదు. మీ స్నేహితులతో సహజంగా ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాలి! భవ్యా... ఇప్పుడు నువ్వు ఆర్జేవి. నీకు ఇష్టమైన టాపిక్‌పై మాట్లాడు...’ భవ్య మైక్‌ ముందుకు వచ్చింది.

‘హాయ్‌ ఫ్రెండ్స్, నేను మీ భవ్యను. ప్రతి ఒక్కరికీ జ్ఞాపకాలు ఉంటాయి. నాకు ఎప్పుడూ నవ్వు తెచ్చే జ్ఞాపకం ఒకటి ఉంది. మా గ్రామంలో సంగ్రామ్‌ అనే ఒకాయన ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ఎవరికో ఒకరికి జాగ్రత్తలు చెబుతూనే ఉండేవాడు. అయితే అందరికీ జాగ్రత్తలు చెబుతూనే తాను పొరపాట్లు చేసేవాడు. ఒకరోజు వర్షం పడి వెలిసింది. ఎటు చూసినా తడి తడిగా ఉంది..కాస్త జాగ్రత్త సుమా! అని  ఎవరికో చెబుతూ ఈ సంగ్రామ్‌ సర్రుమని జారి పడ్డాడు. అందరం ఒకటే  నవ్వడం!

ఒకరోజు సంగ్రామ్‌  ఏదో ఫంక్షన్‌కు వచ్చాడు.
ఎవరికో చెబుతున్నాడు... వెనకా ముందు చూసుకొని జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇది అసలే కలికాలం...అని చెబుతూ, తన వెనక కుర్చీ ఉందన్న భ్రమలో కూర్చోబోయి ధబాలున కిందపడ్డాడు!’

....ఆ ఆరుగురు మహిళా ఆర్‌జేలు, హాస్యసంఘటనలను ఆకట్టుకునేలా ఎలా చెప్పాలనే విషయంలో కాదు, శ్రోతలు కోరుకున్న పాట ప్లే చేసేముందు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ‘సత్యమైన జ్ఞానమే ఆత్మజ్ఞానం’లాంటి ఆధ్యాత్మిక విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు ఎలా సులభంగా చెప్పాలి... ఇలా ఎన్నో విషయాలలో ఒక రేడియోకోసం ఆ ఆరుగురు మహిళలు శిక్షణ తీసుకున్నారు.

అయితే ఆ రేడియో మెట్రో సిటీలలో కొత్తగా వచ్చిన రేడియో కాదు, ఆ మహిళలు జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లు అంతకంటే కాదు.
అది అంబాల జైలు రేడియో. ఆ ఆరుగురు మహిళలు... ఆ జైలులోని మహిళా ఖైదీలు.
హరియాణాలోని అంబాల సెంట్రల్‌ జైలులో ఖైదీల మానసిక వికాసం, సంతోషం కోసం ప్రత్యేకమైన రేడియో ఏర్పాటు చేశారు. ఆరుగురు మగ ఆరేజే (ఖైదీలు)లు ఈ రేడియో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడిక మహిళల వంతు వచ్చింది.

రేడియో కార్యక్రమాల నిర్వహణ కోసం ఆరుగురు మహిళా ఖైదీలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో ‘ఆర్‌జే’గా విధులు నిర్వహించనున్నారు.
దిల్లీ యూనివర్శిటీ జర్నలిజం డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ వర్తిక నందా ఈ ఆరుగురికి శిక్షణ ఇచ్చారు.
‘ఒత్తిడి, ఒంటరితనం పోగొట్టడానికి, మనం ఒక కుటుంబం అనే భావన కలిగించడానికి ఈ రేడియో ఎంతో ఉపయోగపడుతుంది’ అంటుంది నందా.
ఈ మాట ఎలా ఉన్నా మహిళా ఆర్‌జేల రాకతో ‘అంబాల జైలు రేడియో’కు మరింత శక్తి, కొత్త కళ రానుంది!

మరిన్ని వార్తలు