Arpita Mukherjee: వహ్వా.. గౌహర్‌ జాన్‌ పాత్రలో జీవించిన అర్పిత!

2 Oct, 2021 12:23 IST|Sakshi

మై నేమ్‌ ఈజ్‌ జాన్‌... గౌహర్‌ జాన్‌!

ప్లేబ్యాక్‌సింగర్‌గా పరిచితమైన అర్పిత ముఖర్జీ పరకాయ ప్రవేశంలో ఎలాంటి శిక్షణ తీసుకోలేదు! కాని రంగస్థలంపై లెజండరీ సింగర్‌ గౌహర్‌ జాన్‌ పాత్రలో జీవించిన తీరు చూస్తే ఆమెకు పరకాయ ప్రవేశం వచ్చునని కాస్త సరదాగా అనుకోవచ్చు. గౌహర్‌ జాన్‌ జీవితంపై రూపొందించిన ‘మై నేమ్‌ ఈజ్‌ జాన్‌’ ప్లేలో అర్పిత ముఖర్జీ ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నటన–నాట్యం– గానం మేళవింపు ఈ ప్లే. పాపులర్‌ ఓల్డ్‌ బెంగాలీ సాంగ్స్, పంజాబీ టప్పా, గుజరాత్‌ క్లాసికల్‌... ఒకటా రెండా కనుల విందుకు తోడు వీనుల విందు! ‘రంగస్థల గౌహర్‌ జాన్‌’ను చూసే ఇంత అబ్బురపడుతున్న ప్రేక్షక సమూహాలకు వాస్తవజీవితంలోని వ్యక్తి కళ్ల ముందు నిలిస్తే ఎంత అపురూపమో కదా అనిపిస్తుంది.

ఈ తరానికి బొత్తిగా పరిచయం లేని పేరు... గౌహర్‌ జాన్‌. తొలితరం గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ సింగర్‌ గా ప్రసిద్ధురాలైన గౌహర్‌ జాన్‌ ఎన్నో భాషల్లో 700 పాటలు పాడి ‘ది గ్రామ్‌ఫోన్‌ గర్ల్‌’ ‘ది ఫస్ట్‌ రికార్డింగ్‌ సూపర్‌స్టార్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు తెచ్చుకుంది. భారతీయ భాషల్లోనే కాదు అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్‌.. మొదలైన భాషల్లోనూ పాటలు పాడి మెప్పించింది. ఈకాలంలో గౌహర్‌జాన్‌ను గుర్తు చేసుకోవడం అంటే... ఒక గాయని వ్యక్తిగతజీవితం తెలుసుకోవడం కాదు. చరిత్ర లోతుల్లోకి వెళ్లడం. ఆకాలంలో ప్రతిభావంతులైన మహిళలు ఎన్నెన్ని కష్టాలను భరించి, ఆ కష్టాలకు వెరవకుండా, లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ఉన్నతస్థాయికి ఎలా చేరారో తెలుసుకోవడం.


గౌహర్‌ జాన్‌

1873లో ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించింది జాన్‌. ఇంజనీర్‌ రాబర్ట్‌ యెవర్డ్, గాయని, నృత్యకారిణి ఎలెన్‌ విక్టోరియా హెలెన్‌లకు జన్మించిన ఏంజెలినా యెవర్డ్‌ ‘గౌహర్‌ జాన్‌’గా గొప్ప పేరు తెచ్చుకునే స్థాయికి ఎదగడం వరకు నడిచింది నల్లేరుపై నడక కాదు. ముళ్ల కంచెపై ప్రయాణం. గొంతులో దాగిన విషయాన్ని కప్పిపెట్టి...అమృతంలాంటి పాటలు పాడింది. కాళ్లకు గుచ్చుకున్న ముండ్లను తీసేసి... అపురూపమైన నృత్యం చేసింది.

ఒకానొకరోజు మిస్టర్‌ రాబర్ట్‌ భార్యా పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఉన్న ఊరు నుంచి పొట్ట చేతపట్టుకొని బిడ్డను తీసుకొని బెనారస్‌కు వెళ్లింది విక్టోరియా. అక్కడ ఖుర్షీద్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూతురి పేరుని ‘గౌహర్‌ జాన్‌’గా మార్చింది. ఈ పేరుతోనే కాకుండా ‘మల్కా జాన్‌’గా కూడా ప్రసిద్ధురాలైంది ఏంజెలినా. ప్రముఖ ఆడియో కంపెనీ ఒకటి గౌహర్‌ జాన్‌ ఆణిముత్యాలను రీ–రిలీజ్‌ చేసే ప్రయత్నంలో ఉంది. రేపో మాపో బాలీవుడ్‌లో గౌహర్‌ జాన్‌ బయోపిక్‌ వార్త కూడా వినవచ్చు!  

చదవండి: Sheelaa Bajaj: ధీర వనిత.. నానమ్మ కథ      

మరిన్ని వార్తలు