మేకింగ్‌ ఆఫ్‌ ఎ క్వీన్‌.. పచ్చళ్ల మహారాణి

25 Jun, 2021 00:06 IST|Sakshi
పికిల్‌ క్వీన్‌ యదే డుజోమ్‌

నాలుగేళ్ల వయసులో తల్లి చనిపోయింది. చెల్లిని తీసుకుని అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోయింది డుజోమ్‌. అక్కాచెల్లెళ్లు టీనేజ్‌ లోకి వస్తుండగా అమ్మమ్మ కూడా చనిపోయింది. మారుతల్లి ఉన్నా తల్లి కాలేకపోయింది. ఆమె దగ్గర కనాకష్టంగా బతికి ఇంటర్మీడియెట్‌ అవగానే రాజధాని ఇటానగర్‌ వెళ్లిపోయింది. అదే ఆమె జీవితానికి మలుపయింది. ఇప్పుడామె ‘పికిల్‌ క్వీన్‌’! పచ్చళ్ల సామ్రాజ్ఞి. బాగా డబ్బు సంపాదిస్తున్న వ్యాపారులు ఇంకొకర్ని తమ దారి లోకి రానివ్వరు. కానీ డుజోమ్‌.. నిరుపేద గృహిణుల స్వయం సమృద్ధి కోసం వారికి పచ్చళ్ల మేకింగ్‌లో, మార్కెటింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇస్తోంది.

యదే డుజోమ్‌ ఎనిమిదవ తరగతి చదువుతుండగా అమ్మమ్మ చనిపోవడంతో డుజోమ్, ఆమె చెల్లెలు మళ్లీ తండ్రి చెంతకే వారు చేరవలసి వచ్చింది. తండ్రి ఒక్కడే లేడు ఆ ఇంట్లో! ఇంకో ‘అమ్మ’ కూడా ఉంది.  తనను, చెల్లిని ఆమె ఎంత హింసపెట్టిందో డుజోమ్‌ కొన్నిసార్లు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. డుజోమ్‌ ఇప్పుడు పచ్చళ్ల వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ‘అరుణాచల్‌ పికిల్‌ హౌస్‌’ అంటే ఇప్పుడు ఆ రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో పెద్ద పేరు. అయితే పికిల్‌ హౌస్‌ ప్రారంభం రోజు ఒక్కరంటే ఒక్కరు కూడా అటువైపే రాలేదు!

‘పికిల్‌ క్వీన్‌’గా ప్రసిద్ధి చెందిన డుజోమ్‌ తన వ్యాపారం గురించి మాత్రమే చూసుకోవడం లేదు. ఆర్థికంగా అసహాయులైన గృహిణులనూ చూసుకుంటోంది. వారిని చేరదీసి పచ్చళ్ల తయారీలో శిక్షణ ఇస్తోంది. పచ్చళ్ల మార్కెటింగ్‌ గురించి టిప్స్‌ ఇస్తోంది. అలా ఇటానగర్‌లోని ఎందరో గృహిణులను గ్రూపులుగా చేసి, ఉపాధి నైపుణ్యాలను నేర్పిస్తోంది. అసలు ఇదంతా ఆమెకు ఎలా చేతనైనట్లు?!
‘‘జీవితంలో కష్టాలు తప్పవు. ఆ కష్టాల్లోనే పరిష్కారం దొరుకుతుంది. ఎప్పటికీ నిరాశ చెందకూడదు’’ అంటుంది డుజోమ్‌.
డుజోమ్‌కు ఇప్పుడు 29 ఏళ్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ‘అరుణాచల్‌ పికిల్‌ హౌస్‌’ను ప్రారంభించింది. ఈ నాలుగు నెలల్లో పికిల్‌ క్వీన్‌ అయింది!
∙∙
పినతల్లి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ పన్నెండేళ్లలో నెలకింతని డబ్బును దాచిపెట్టగలిగింది డుజోమ్‌. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో శిక్షణ తీసుకుంది. లేబుల్‌ మేకింగ్‌ నేర్చుకుంది. పదార్థాలను ఎలా నిల్వ ఉంచాలో తెలుసుకుంది. పచ్చళ్ల తయారీ మెళకువలను మణిపుర్‌ వెళ్లిప్పుడు అక్కడ కొంతమంది మహిళల నుంచి శ్రద్ధగా గ్రహించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ తిరిగొచ్చాక పచ్చళ్ల తయారీ పద్ధతులలో శాస్త్రీయంగా శిక్షణ పొందింది. ఆ క్రమంలో పికిల్‌ హౌస్‌ అంకురార్పణ జరిగింది. ప్రస్తుతం ఎనిమిది మంది సిబ్బంది ఆమెకు చేదోడుగా ఉన్నారు. వారంతా గృహిణులు.
లేమిలో, కుటుంబ సమస్యల కుంగుబాటులో ఉన్నవారు. వారిని పెట్టుబడి లేని భాగస్వాములుగా చేర్చుకుంది. అమ్మకాల వల్ల వస్తున్న లాభాలను వారికి పంచుతోంది. వ్యాపారాన్ని మరింతగా పెంచాలన్న ఆలోచనలో ఉంది.
డుజోమ్‌ తనకు తానుగా వెజ్, నాన్‌వెజ్‌ పచ్చళ్లను రుచికరంగా తయారు చేయడంలో నిపుణురాలు. ప్రత్యేకించి ఆమె పెట్టే.. చేపలు, పోర్క్, చికెన్, అల్లం, వంకాయ, కాప్సికమ్, బంగాళదుంప, పనస, ముల్లంగి నిల్వ పచ్చళ్లు ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాగే డిమాండ్‌ కూడా. చెల్లెలు కూడా ఇప్పుడు ఆమెతోనే ఉంటోంది. ఇటానగర్‌ ఆమె అమ్మ తరఫు వారు ఉండే పట్టణం. అందుకనే డుజోమ్‌ అక్కడ స్థిరపడింది.  
 

మరిన్ని వార్తలు