కళింగసీమలో స్వర్ణోత్సవ ‘వికాసం’

24 Dec, 2022 13:02 IST|Sakshi

తెలుగునేలకు వెలుపల ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో ఆవిర్భవించిన తెలుగు సాహితీ సంస్థ ‘వికాసం’ స్వర్ణోత్సవాలు జరుపుకొంటోంది. ఈ సంస్థ పూర్తిపేరు ‘వికాసాంధ్ర సాహితీ సాంస్కృ తిక సంవేదిక’. ప్రముఖ రచయిత అవసరాల రామకృష్ణారావు అధ్యక్షతన 1970 నవంబర్‌ 14న ‘వికాసం’ ఆవిర్భవించింది. అవసరాల అధ్యక్షునిగా ఉన్నకాలంలోనే ‘మనం మనం బరంపురం’ కథా సంకలనాన్ని ‘వికాసం’ వెలువరించింది.

అవసరాల విశాఖకు తరలిపోయాక, రష్యా నుంచి స్వస్థలమైన బరంపురం తిరిగి వచ్చేసిన డాక్టర్‌ ఉప్పల లక్ష్మణరావు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ‘వికాసం’లో ఉన్నకాలంలోనే ఆయన ‘అతడు–ఆమె’ నవలను పూర్తిచేశారు. ఉప్పల లక్ష్మణరావు సారథ్యంలో ‘వికాసం’ ఆదర్శప్రాయమైన సాహితీ సంస్థగా రూపుదిద్దుకుంది. ‘వికాసం’ మలిప్రచురణ ‘ఉండండుండండి’ కవితా సంపుటి పురిపండా అప్పలస్వామి సంపాద కత్వంలో వెలువడింది. బి.ఎల్‌.ఎన్‌.స్వామి, తాతిరాజు వెంకటేశ్వర్లు, సేతుపతి ఆదినారాయణ, మండపాక కామేశ్వరరావు, గరికిపాటి దేవదాసు, మురళీమోహన్, దేవరాజు రవి, వై.ఎన్‌.జగదీశ్, బచ్చు దేవి సుభ్రదామణి, పోతాప్రగడ ఉమాదేవి, సుశీల తదిత రులు తొలితరం సభ్యులు.

‘వికాసం’ సభ్యులు విజయచంద్ర, దేవరకొండ సహదేవ రావు, రమేష్‌రాజు తదితరులు కొంతకాలం ‘స్పృహ’ సాహితీ పత్రికను నడిపారు. శ్రీశ్రీ ఆవిష్కరించిన ఈ పత్రిక రెండున్నరేళ్ల పాటు కళింగాంధ్ర రచయితలకు వేదికగా నిలిచింది. కాళోజీ, శివారెడ్డి, నందిని సిధారెడ్డి, వంగపండు ప్రసాద్‌ తదితర కవి ప్రముఖులు ‘స్పృహ’ కార్యాలయాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ‘వికాసం’ అనేక సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. ఎందరో సాహితీ ప్రముఖులను బరంపురానికి ఆహ్వానించింది.

‘వికాసం’ వారం వారం సాహితీ సమావేశాలతో పాటు ‘నెలనెలా వెన్నెల’ క్రమం తప్పకుండా నిర్వహించేది. ఇందులో ఎందరో స్థానిక ఔత్సాహిక కవులు, రచయితలు పాల్గొని స్వీయరచనలను వినిపించేవారు. ప్రస్తుతం ప్రతినెలా కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితులు లేకున్నా, సాధ్యమైనంత విరివిగానే తన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. బరంపురంలోని ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజం, ఆంధ్ర సంస్కృతీ సమితి తదితర సంస్థలతో కలసి మెలసి పనిచేస్తోంది. ఒడిశాలో తెలుగు చదువులు పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితుల్లోనూ ‘వికాసం’ యాభయ్యేళ్లుగా తన ఉనికిని నిలుపుకొంటూ రావడం విశేషం. 

‘వికాసం’ స్వర్ణోత్సవాలు డాక్టర్‌ దేవరకొండ సహదేవరావు అధ్యక్షతన డిసెంబర్‌ 24, 25 తేదీల్లో బరంపురం ఆంధ్రభాషాభివర్ధనీ సమాజం ప్రకాశం హాలులో జరగనున్నాయి. శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్, భూసురపల్లి వెంకటేశ్వర్లు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, అట్టాడ అప్పల నాయుడు, ఒడియా సాహితీవేత్తలు బంగాళి నందా, గౌరహరి దాస్‌ పాల్గొననున్నారు. ఇందులో కెవీవీఎస్‌ మూర్తి అనువదించిన ‘గౌరహరిదాస్‌ కథలు’, రొక్కం కామేశ్వరరావు ‘ముఖారి’ కవితా సంపు టితో పాటు, అంతర్ముగం (తమిళ అనువాదం), అంతర్ముఖ్‌ (హిందీ అనువాదం), ‘జ్ఞానా మృత్‌’ (హిందీ అనువాదం), ఇన్నర్‌ విజన్‌ (ఇంగ్లిష్‌ అనువాదం), పి. ఉమాదేవి ‘ఉమాదేవి సాహితీ సుమాలు’, విజయచంద్ర కవితల ఇంగ్లిష్‌ అనువాదం ‘విండ్స్‌ ఆర్‌ అలైవ్‌’, వరదా నర సింహారావు ‘కన్యాశుల్కం నాటకం: స్త్రీల స్థితిగతులు’, ‘మనం మనం బరంపురం’ రెండో ప్రచురణ, పన్యాల జగన్నాథ దాసు తొలి కవితా సంపుటి ‘ఏడో రుతువు కోసం’ విడుదల కానున్నాయి.

– పన్యాల జగన్నాథ దాసు, సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు